FbTelugu

ప్రగతి భవన్ కు కాంగ్రెస్ తాకట్టు: ఎమ్మెల్యే రఘు

హుజూరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రగతి భవన్ లో తాకట్టు పెట్టేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు మల్లు భట్టి విక్రమార్క, తూర్పు జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, రాజగోపాల్ రెడ్డి వెళ్తున్నారని బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రంగా విమర్శించారు.
టిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ నాయకులు బి టీమ్ కాబట్టే సిఎం కెసిఆర్ అప్పాయింట్ మెంట్ ఇచ్చారని, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ మద్దతు కోసమే ఈ డ్రామా అని ఆయన మండిపడ్డారు. సిఎం అయిన తరువాత కెసిఆర్ ఏనాడు ప్రతిపక్ష పార్టీలకు, ఎమ్మెల్యేలకు అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదని, ఇది తొలిసారి అని రఘునందన్ అన్నారు. ఆంధ్రా నుండి వచ్చిన వారి కాళ్లకు ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తా అని కెసిఆర్ అన్న విషయం మరిచిపోవద్దన్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం కెసిఆర్ యావత్ కుటుంబంతో వెళ్లిన సందర్బంగా వైసిపి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా ఇంటికి వెళ్ళింది ఎవరు?, అన్ని రకాల నాన్ వేజ్ భోజనం తిన్నది ఎవరని రఘునందన్ నిలదీశారు. రాయలసీమ ను రతనాల సీమ చేస్తా అన్నది ఎవరని అడిగారు. నాటి కెసిఆర్ మాటలను మర్చిపోయి ఇప్పుడు ఆర్ అండ్ బి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతున్నది ఏందన్నారు. లంకలో పుట్టినోళ్లు అందరూ రాక్షసులే అని కెసిఆర్ అన్నాడు. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలు లేవు.. ఆంధ్రోళ్ల ఓట్లు అవసరం లేదు అయినా మరోసారి సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్, ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్ రావుల వెంట ఉన్నవారు ఎవరు, బిజినెస్ పార్ట్ నర్లు, కాంట్రాక్టర్లు ఎవరని రఘునందన్ ప్రశ్నించారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్వయంగా ఒప్పుకోవడాన్ని అభినందించారు. ఒక్క డబుల్ బెడ్ రూమ్ కట్టలేదు అంటే దానికి కారణం ఈటల రాజేందరా? ప్రభుత్వ పనితీరు కు నిదర్శనమా? అని ప్రశ్నించారు. . గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల కు ఇచిన్నట్లు నిధులు ఇతర నియోజక వర్గాలకు ఇవ్వడం లేదని బాల్క సుమన్ ఒప్పుకున్నాడన్నారు. బాల్క సుమన్ బానిస సుమన్ అని, కెసిఆర్ కుటుంబానికి బానిస అని అన్నారు.

తెలంగాణ కోసం నువ్వొక్కడివే ఉద్యమం చేయలేదని, ప్రత్యేక రాష్ట్రం రావడానికి బిజెపి కూడా కారణం అనే విషయం తెలుసుకోవాలని హితవు పలికారు. ఓటమి కళ్ల ముందు కన్పిస్తుండడంతో టిఆర్ఎస్ కుయుక్తులకు తెరలేపిందని, ఈటల రాజేందర్ ఇటీవల సిఎం కెసిఆర్ ను వేడుకుంటూ లేఖ రాసినట్లు ఒక ఫేక్ లెటర్ ను సృష్టించారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో అభివృద్ధి మీద, ఆత్మ గౌరవం మీద చర్చకు సిద్ధమా అని రఘునందన్ ప్రశ్నించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.