FbTelugu

జానా.. నహీ జానా?

ఇప్పుడు తెలంగాణలో బీజేపీ హవా నడుస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికల దగ్గర నుంచి ఆ పార్టీ దశ తిరిగింది. వరుస ఎన్నికల్లో విజయపరంపరను కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు అసెంబ్లీలో ఒక స్థానంతో పరిమితమైన కమలం పార్టీ దుబ్బాకలో విజయం సాధించి ఆ సంఖ్యను రెండుకు పెంచుకుంది. ఇప్పుడు నోముల నర్సింహయ్య మృతితో త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలోనూ పాగా వేసేందుకు ఆ పార్టీ నేతలు వ్యూహ రచన చేస్తున్నారు. వాస్తవానికి సాగర్‌ నియోజకవర్గంలో బీజేపీది నామమాత్రపు పాత్ర. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి కేవలం రెండు వేల పైచిలుకు ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ పాగా వేయాలంటే బలమైన అభ్యర్థి కావాలన్న నిర్ణయానికి కమలనాథులు వచ్చారు.

దీంతో కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న కాంగ్రెస్‌ నేత జానారెడ్డిని కమలదళంలో చేర్పించి ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చేలా ప్లాన్‌ చేశారు. ముందుగా జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డిని బరిలోకి దింపాలనుకున్నారట. అందులో భాగంగా ఆయనతో ఇప్పటికే కమలనాథులు సంప్రదింపులు జరిపారని, రఘువీర్‌రెడ్డి మాత్రం ఆలోచించి నిర్ణయం చెబుతానని చెప్పారట. ఆ తర్వాత జానారెడ్డినే బరిలోకి దింపాలని కమలనాథులు భావించారని, దీంతో నేరుగా ఆయనతోనే సంప్రదింపులు జరిపారని జోరుగా చర్చ సాగుతోంది. జానారెడ్డి, ఆయన కుమారుడు త్వరలో బీజేపీలో చేరతారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే, ఇప్పటివరకు దీనిపై జానారెడ్డి ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఆయన కుమారుడు మాత్రం ఇదంతా వదంతి మాత్రమేనని కొట్టి పారేశారు. ఈ ప్రచారంపై జానారెడ్డి మౌనంగా ఉండడం అనుమానాలకు తావిస్తోంది. వాస్తవానికి జానారెడ్డి స్థానికంగా లేరు. ఆయన వ్యక్తిగత పనిపై కేరళలో ఉన్నారు. అయినా, ఇక్కడ జరుగుతున్న పరిణామాలేవీ ఆయనకు తెలియవు అనుకోవడం పొరపాటే. అయినా, తనమీద, తన కుమారుడి మీద పార్టీ మార్పు ప్రచారం జరుగుతున్నా ఎందుకు మాట్లాడడం లేదన్న చర్చ సాగుతోంది. విజయశాంతి కూడా బీజేపీలో చేరతారని మొదటినుంచీ ప్రచారం సాగింది. బీజేపీ నేతలు ఆమెను కలిసిన తర్వాత కూడా విజయశాంతి పార్టీ మార్పుపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌కు ప్రచారం చేయలేదు. కేవలం టీఆర్‌ఎస్‌ను, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లను తిట్టిపోశారు తప్ప కాంగ్రెస్‌కు ఓటేయమని కూడా చెప్పలేదు.

ఆమె పార్టీ మారుతుందని కొందరు.. లేదు లేదు అని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ప్రకటనలు గుప్పించారు. చివరకు ఆమె ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిశారు. సోమవారం అధికారికంగా బీజేపీలో చేరారు. విజయశాంతి బీజేపీలో చేరేవరకు ఈ విషయాన్ని గోప్యంగానే ఉంచింది. ఆమె బాటలోనే జానారెడ్డి కూడా విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ జానారెడ్డి బీజేపీలోకి వెళుతున్నారా.. లేదా అన్న విషయంపై తెలంగాణతో పాటు ఏపీలో కూడా చర్చ రసవత్తరంగా సాగుతోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.