FbTelugu

కింగ్ కోఠి మృతులకు రూ.10 లక్షల పరిహారం: బిజెపి

హైదరాబాద్: కింగ్ కోఠి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ లో సమయానికి ఆక్సిజన్ అందక ఏడుగురు కరోనా రోగుల ప్రాణాలు గాలిలో కలిశాయని బిజెపి ముఖ్య అధికార ప్రతినిధి కె. కృష్ణ సాగర్ రావు విమర్శించారు.

ఆక్సిజన్ ఆలస్యం అవడం వల్ల వీళ్లే కాకుండా, మిగతా రోగులకు కూడా పరిస్థితి విషమించిందని ఆందోళన వ్యక్తం చేశారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో ఐఏఎస్ అధికారులు ఆక్సిజన్ ట్యాంకర్ల దగ్గర, విమానాలతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేయడంలోనే బిజీగా ఉన్నారని కృష్ణ సాగర్ రావు ఆరోపించారు. ఇతర రాష్ట్రాల నుంచి రావాల్సిన ఆక్సిజన్ సమయానికి తేవడానికి తగిన రవాణా, ఇతర ఏర్పాట్లు చేయడంలో ఈ అధికారుల నేరపూరిత నిర్లక్ష్యం వహించారన్నారు. వారి అసమర్థత వల్లనే తెలంగాణ రాష్ట్రంలో కరోనా రోగులు మరణిస్తున్నారని మండిపడ్డారు. ఆక్సిజన్ ట్యాంకర్ లారీ కింగ్ కోఠి ఆసుపత్రి కొద్ది కిలోమీటర్ల దూరంలోనే వచ్చి ఆగి, అక్కడి నుంచి ఉస్మానియా హాస్పిటల్ కు వెళ్లాడన్నారు. దీని వల్ల కింగ్ కోఠిలో రోగులకు ఆక్సిజన్ అందకుండా పోయిందన్నారు. జిపిఎస్ టెక్నాలజీ అందుబాటులో ఉన్నా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉపయోగించుకోవడం లేదన్నారు. ఆక్సిజన్ లారీని ఏ ఆసుపత్రికి సరిగా పంపాలో తెలియక, ఎక్కడ ఆక్సిజన్ అవసరమో గుర్తించలేక ప్రజల ప్రాణాలు తీస్తున్నారన్నారు. ఈటల రాజేందర్ బర్తరఫ్ తరువాత వైద్య, ఆరోగ్య శాఖ కూడా చూస్తోన్న ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ మరణాలకు బాధ్యత వహించాలని కృష్ణ సాగర్ రావు డిమాండ్ చేశారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వారు మరణించారు కాబట్టి, ఆ కుటుంబాలకు రూ.10 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని బిజేపి డిమాండ్ చేస్తోందన్నారు. దేశంలో ఓవైపు చాలా రాష్ట్రాలకు ఆక్సిజన్ దొరకడమే గగనమైపోతున్న కాలంలో, కేంద్రం నుంచి యుద్ధ విమానాల ద్వారా అందిన ఆక్సిజన్ ను లారీల్లో రవాణా కూడా చేయలేనంత చేతకాని పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందు కరోనాపై దృష్టి పెట్టాలని, వాటి సంగతి చూసి తరువాత పార్టీ అంతర్గత రాజకీయాలు చూసుకుంటే మంచిదని కృష్ణ సాగర్ రావు హితవు పలికారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.