FbTelugu

కరోనా కట్టడిలో ఏపీ విఫలం: బీజేపీ, జనసేన

అమరావతి: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోందని బీజేపీ, జనసేన పార్టీ కీలక నేతల సమావేశం అభిప్రాయపడింది. పరీక్షల సంఖ్య పెరిగినప్పటికీ వేగంగా విస్తరిస్తున్న వ్యాధిని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా పని చేయడం లేదని విమర్శించింది.
వ్యాధి నివారణలో క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది రక్షణలో సర్కారు వైఫల్యం ప్రస్ఫుటంగా కనిపిస్తోందని ఇరు పార్టీల అగ్రనాయకులు పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. కరోనా నివారణలో ఎక్కడ లోటుపాట్లు ఉంటే అక్కడ ప్రజా పక్షాన నిలబడి పోరాటం చేయాలని ఉభయపక్షాల నేతలు నిర్ణయించారు.

ఈ విపత్కాలంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ఆత్మ నిర్భర భారత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా అమలు అవుతుందో అధ్యయనం చేసిన తరువాత వాటి వివరాలను మీడియాతో పంచుకోవాలని నిర్ణయించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా నిర్మించిన ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు లబ్ధిదారులకు అందించ లేకపోయిందని సమావేశం అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ ఇళ్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 9 వేల కోట్ల రూపాయలను అందించిందని సమావేశం గుర్తు చేసింది.

టీటీడీ ఆస్తుల అమ్మకం, ప్రభుత్వ భూములు, గుంటూరు మార్కెట్ యార్డు స్థలం అమ్మకం, విద్యుత్ బిల్లుల విషయంలో బీజేపీ, జనసేన పార్టీలు సంయుక్తంగా జరిపిన పోరాటంపై సమావేశం సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో లో బీజేపీ పార్టీ నుంచి సతీష్ జీ, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి సునీల్ దియోధర్, రాజ్యసభ సభ్యులు జి.వి.ఎల్.నరసింహ రావు, కన్నా లక్ష్మీనారాయణ, దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుకర్, జనసేన నుంచి కొణిదెల పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.

You might also like