FbTelugu

బర్త్‌డే పార్టీలు… క‌రోనా కేంద్రాలా..?

మూసీ వ‌ర‌ద‌లు, టీబీ, స్పానిష్ ఫ్లూ వంటి భ‌యాన‌క రోగాల‌కు ఎదురొడ్డి నిలిచి హైద‌రాబాద్‌కు ఏమైంది?

తెలంగాణ అంతటా క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నా కేవ‌లం గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోనే ఎందుకు న‌మోద‌వుతున్నాయి?

మే నెల మొద‌టి నుంచి గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోనే ఎక్కువ‌గా కేసులు న‌మోద‌వుతున్నాయి. తెలంగాణ‌లో వ‌స్తున్న కేసుల‌లో 95శాతం కేసులు కేవ‌లం రాజ‌ధాని ప‌రిధిలోనే ఉన్నాయి. అధికారులు ఎంత‌గా క‌ట్ట‌డి చేస్తున్నా ఆగ‌డం లేదు. అస‌లు ఎందుకింతగా క‌రోనా హైద‌రాబాద్‌లో మాత్ర‌మే విల‌యతాండవం చేస్తోంద‌నే విష‌యం దృష్టి పెట్టిన అధికారుల‌కు విస్తుపోయే వాస్త‌వాలు తెలిశాయి.

గ్రేట‌ర్ హైదారాబాద్ ప‌రిధి హైద‌రాబాద్‌, రంగారెడ్డి, మేడ్చ‌ల్ జిల్లాల్లో విస్త‌రించి ఉంది. క‌రోనా ప్ర‌బ‌లిన త‌ర్వాత విదేశీయుల రాక కార‌ణంగా ఇక్క‌డ ఎక్కువ కేసులు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత ఢిల్లీలోని నిజాముద్ధీన్‌లో ప్రార్థ‌న‌ల‌కు వెళ్లొచ్చిన వారి నుంచి ఎక్కువ‌గా కేసులు న‌మోద‌య్యాయి. అప్ప‌టివ‌ర‌కు కేవ‌లం కుటుంబ‌స‌భ్యుల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన కాంటాక్టు కేసులు ఏకంగా సంబంధం లేద‌ని వారికి వ్యాపించ‌డం మొద‌ల‌య్యాయి. స‌మాజ‌వ్యాప్తికి క‌రోనా చేరుకునేంత‌గా హైద‌రాబాద్ చేరుకుంది.  మే నెల ప్రారంభం నుంచి తెలంగాణ‌లోని 30 జిల్లాల్లో క‌రోనా కేసులు కొత్త‌గా రావ‌డం దాదాపు త‌గ్గిపోయింది. కేవ‌లం గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో మాత్ర‌మే వ‌స్తోంది. ఇందుకు కార‌ణాల‌ను అధికారులు అన్వేషించారు.

వ‌న‌స్థ‌లిపురంలో ఒక వ్యాపారికి పాజిటివ్ రావ‌డంతో అక్క‌డ 26 మందికి క‌రోనా పాకింది. ఇద్ద‌రు చ‌నిపోయారు కూడా. ఆ వ్యాపారి కుటుంబ‌స‌భ్యులు వేర్వేరు చోట్ల ఉన్న‌ప్ప‌టికీ క‌రోనా పాక‌డంతో ఏదో జ‌రిగింద‌నే అనుమానం అధికారుల్లో క‌లిగింది. తీరా గ్రేట‌ర్ హైద‌రాబాద్ అధికారులు గ‌ట్టిగా ఆరా తీయ‌డంతో అస‌లు విష‌యం తెలిసింది.  వ్యాపారి కుటుంబంలో ఒకరి బ‌ర్త్‌డే పార్టీలో అంద‌రూ క‌లిసిన‌ట్లు తేలింది. అప్పుడు అంద‌రికీ క‌రోనా వ్యాప్తి జ‌రిగింది. ఆ తర్వాత వ‌రుస‌గా ఒక్కొక్క‌రికి క‌రోనా ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డి ఏకంగా 26 కేసులు న‌మోద‌య్యాయి.

మాద‌న్న‌పేట‌లో ఒకే అపార్ట‌మెంట్‌లో 23 మందికి క‌రోనా సోకింది. ఇక్క‌డ ఉండే ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇచ్చిన‌ బ‌ర్త్‌డే పార్టీకి అపార్టుమెంట్‌లోని వారంద‌రూ వ‌చ్చారు. అప్పుడే ఎవ‌రో ఒక‌రి నుంచి క‌రోనా అంద‌రికీ సోకింద‌ని తేలింది.

అత్య‌వ‌స‌ర ప‌నులుంటే త‌ప్ప ప్ర‌జ‌లెవ‌రూ ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని ప్ర‌భుత్వం చెబుతుంటే…. ఇలా కొంద‌రు బ‌ర్త్‌డే పార్టీలు చేసుకుని ప్రాణాలు మీద‌కు తెచ్చుకుంటున్నారు.

న‌గ‌రంలో ఒక కార్పొరేట్ ఆసుప‌త్రి కూడా క‌రోనా వ్యాప్తికి కేంద్రంగా మారింది. డ‌యాల‌సిస్ చేయించుకునే రోగులు నాలుగైదు రోజులకోసారి డ‌యాల‌సిస్ కోసం ఆసుప‌త్రికి వెళుతుంటారు. అలా మ‌ల‌క్‌పేట్ స‌మీపంలోని ఒక ఆసుప‌త్రిలో డ‌యాలసిస్ కోసం వెళ్లిన 5గురికి క‌రోనా వ‌చ్చింది. వీరంతా ఆసుప‌త్రికి వెళ్ళి డ‌యాలసిస్ చేయించుకుని రావ‌డం మ‌రే ఇత‌ర కార్య‌క్ర‌మాలు గానీ, ప్ర‌యాణాలు గానీ చేయ‌లేద‌ని గుర్తించారు. దీనివ‌ల్ల ఆసుప‌త్రిలో డ‌యాల‌సిస్‌కు వెళ్లిన‌ప్పుడే క‌రోనా సోకి ఉంటుందంటున్నారు.

You might also like