FbTelugu

నమ్మినవారే నట్టేట ముంచితే..

నమ్ముకున్న వారే నట్టేట ముంచితే ఆ బాధ వర్ణనాతీతం. ఇలాంటి పరిస్థితి పగవాళ్లకు కూడా వద్దురా దేవుడా అని చెప్పుకుంటుంటాం. ఇప్పుడు అలాంటి బాధలోనే ఉన్నారు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్‌ పార్టీలో ఆయనకు ఓ ప్రత్యేకస్థానం ఉంది.

అందుకే ఆయన పట్టుబట్టి తనవాళ్లకు టికెట్లు ఇప్పించుకుంటారు. టికెట్లు ఇప్పించుకోవడమే కాదు వారు విజయం సాధించేలా నిత్యం వ్యూహరచన చేసి వారికి చేదోడు వాదోడుగా నిలుస్తారన్న పేరుంది. అందుకే కాంగ్రెస్‌ అధిష్టానం కూడా ఆయన మాటకు విలువనిచ్చి ఆయన అనుచరులకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లనిచ్చేది. అలా ఆయన ద్వారా ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు పొందిన వారే ఇప్పుడు ఆయనకు ఝలక్‌ ఇవ్వడంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా మారింది. వెంకటరెడ్డి తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి మొదట్లో వ్యాపార రంగంలో బిజీగా ఉండేవారు. అయితే ఆయనను వెంకటరెడ్డి రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే భువనగిరి ఎంపీ స్థానాన్ని ఆయనకు కేటాయించేలా ప్రయత్నం చేసి కాంగ్రెస్‌ పార్టీ నుంచి టికెట్‌ ఇప్పించుకున్నారు. ఆయన విజయం సాధించడంలోనూ అన్నీ తానై కదిలారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బూర నర్సయ్య చేతిలో పరాజయం పాలయ్యారు. 2018లో జరిగిన ఎన్నికల్లో మునుగోడు ఎమ్మెల్యే టికెట్‌ను రాజగోపాల్‌రెడ్డికి ఇప్పించుకున్నారు.

అదేవిధంగా కోమటిరెడ్డి కుటుంబానికి ఎంతో నమ్మకంగా ఉన్న చిరుమర్తి లింగయ్యకు కూడా నకిరేకల్‌ అసెంబ్లీ స్థానాన్ని కేటాయించేలా చేసుకున్నారు. చిరుమర్తికి టికెట్‌ ఇచ్చేందుకు పార్టీ నిరాకరించినా పట్టుబట్టి ఆ స్థానాన్ని సాధించారని, చిరుమర్తికి టికెట్‌ ఇవ్వకుంటే తాను కూడా ఎన్నికల్లో పోటీచేయనని అధిష్టానానికి చెప్పినట్టు అప్పట్లో ప్రచారం సాగింది. ఇలా పార్టీపై ఒత్తిడి తెచ్చి తను నమ్ముకున్న వారిని ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నార కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అయితే, అంత నమ్మకంగా ఉన్న ఆ ఇద్దరూ ఇప్పుడు కోమటిరెడ్డికి ఝలక్‌ ఇవ్వడాన్ని వెంకటరెడ్డి జీర్ణించుకోలేక పోతున్నారట. నకిరేకల్‌ నుంచి గెలిపించుకున్న చిరుమర్తి లింగయ్య టీఆర్‌ఎస్‌లో చేరారు. అంతేకాదు.. ఆయనను అందలం ఎక్కించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డినే టార్గెట్‌ చేసి మాట్లాడడాన్ని తట్టుకోలేక పోతున్నారట. ఈ గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోటుకుంటున్న ఆయనకు రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు పుండుమీద కారం చల్లినట్టుగా మారాయి. రాజగోపాల్‌రెడ్డి త్వరలో బీజేపీలో చేరతానని ప్రకటించడంతో నమ్మినవారే నట్టేట ముంచారన్న బాధలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారట.

You might also like

Leave A Reply

Your email address will not be published.