FbTelugu

నోటుకు ‘‘పిసిసి చీఫ్’’ పోస్టు అమ్మారు: ఎంపి వెంకట్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ పిసిసి చీఫ్ పదవిని నోటుకు అమ్ముకున్నారని, త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడ్తానని భువనగిరి ఎం.పి, కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
పిసిసి చీఫ్ పదవి ఆశించిన భంగపడిన వెంకట్ రెడ్డి ఇవాళ సాయంత్రం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, గంటకో పార్టీ మార్చే నాయకులను సహించలేదని, తమిళనాడులో సీట్లు అమ్ముకున్నట్లుగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జీ మాణిక్కం ఠాగూర్ అమ్ముకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఓటుకు నోటు మాదిరి అధిష్ఠానం నేతలు అమ్ముడుపోయారన్నారు. గత ముప్పై ఏళ్లుగా పార్టీ కోసం ప్రజలు, కార్యకర్తల మధ్య ఉండి పనిచేయడంతో పిసిసి చీఫ్ పదవి ఇస్తారని అనుకున్నానని అన్నారు. రాష్ట్రానికి కొత్తగా వచ్చిన ఇన్ ఛార్జీ మాణిక్కం తో తనకు పదవి రాలేదని వెంకట్ రెడ్డి అన్నారు. పార్టీలు మారిన వారికి పిసిసి కట్టబెట్టారన్నారు. తనను కలిసేందుకు కొత్తగా ఎంపికైన పిసిసి కమిటీ నాయకులు రావద్దని అన్నారు.

ఈ నిర్ణయం మూలంగా లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరిగిందన్నారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధి కోసం పాటుపడతానని, కేంద్రం, రాష్ట్రం నుంచి నిధులు తెచ్చుకునేందుకు అందరినీ కలుస్తానని స్పష్టం చేశారు. కార్యకర్తలు చెల్లాచెదురు కాకుండా ఉండేందుకు భవనగిరి పార్లమెంటు పరిదిలో రేపటి నుంచి పాదయాత్ర చేసి అండగా ఉంటానని ఎంపి వెంకట్ రెడ్డి అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.