FbTelugu

కొనసాగుతున్న భారత్ బంద్

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి.
ఇవాళ ఉదయం నుంచే జాతీయ రహదారులు, రైల్వే ట్రాక్ లపై కూర్చుని రైతులు, వామపక్ష పార్టీల నాయకులు ఆందోళనకు దిగారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పూర్తి స్థాయిలో బంద్ కొనసాగనున్నది. ఎన్నికలు జరుగుతున్న తమిళనాడు, అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలను బంద్ నుంచి మినహాయించారు. ఏపీలోని జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వాణిజ్య, వర్తక సంఘాలు స్వచ్ఛంధంగా బంద్‌కు మద్దతు తెలిపాయి.
ఇవాళ పలు రాష్ట్రాలలో తెల్లవారుజాము నుంచే వామపక్ష నేతలు రోడ్లపై నిరసనలు తెలుపుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు నిరసనగా, వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలంటూ వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

విశాఖపట్నంలో…
భారత్ బంద్‌లో భాగంగా మద్దిలపాలెం జంక్షన్ వద్ద వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు నిరసనగా, వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

కర్నూలు, విజయవాడ, అనంతపురం, ప్రకాశం జిల్లాలో బంద్ కొనసాగుతోంది. కర్నూలు కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సులను వామపక్ష పార్టీల కార్యకర్తలు అడ్డుకోవడంతో బస్సులు నిలిచిపోయాయి. బెజవాడలో భారత్ బంద్‌లో భాగంగా ఉదయం 6గంటల నుండి పండిట్ నెహ్రు బస్టాండ్ వద్ద వామపక్షాలు ఆందోళనకు దిగాయి. బంద్‌కు స్వచ్ఛందంగా విద్యా సంస్థలు, వ్యాపారులు మద్దతు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.