లాక్‌డౌన్‌తో పనులు లేకుండా పోయాయి. ఉద్యోగాలు ఊడిపోయాయి. కొందరు ఊగిసలాటలో ఉన్నారు. ఎవర్ని ఎప్పుడు ఎలా బయటకు పంపుతారనేది తెలియని పరిస్థితులు.
ఇది కేవలం ఏపీ, తెలంగాణలో మాత్రమే కాదు.. యావత్ భారతదేశంలోనూ సవాల్‌గా మారబోతుంది. శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయనే ఆందోళన కూడా పోలీసువర్గాల్లో నెలకొంది. ఆకలి తీర్చుకునేందుకు దొంగతనాలకు పాల్పడే వారి సంఖ్య పెరుగుతుందంటున్నారు. కడుపు నిండిన సంపన్నవర్గాలను లక్ష్యంగా చేసుకుని నేరాలకు దిగేందుకు వీలుంది.
ఇప్పటికే సైబర్ నేరగాళ్లు చెలరేగుతున్నారు. కరోనా ను అవకాశంగా చేసుకుని మాయమాటలతో దోచుకుంటున్నారు. తక్కువ ధరకు కార్లు, బైక్‌లు, ఖరీదైన వాచీలంటూ ఏవో ఆశచూపుతూ.. ఆన్లైన్లో అమ్ముతామంటూ బురిడీ కొట్టిస్తున్నారు. ఇలా.. తెలుగు రాష్ట్రాల్లో వందలాది మంది మోసపోయారు. జనధన్ ఖాతాలో డబ్బులు పడ్డాయంటూ కొందరు.. పేటీఎం, గూగుల్‌పే పేరిట చెల్లింపులను అవకాశం చేసుకుని వేలాది రూపాయలు గుంజుతున్నారు. ఇదిలాఉంటే.. రాబోయే రోజుల్లో ఆకలి, ఆర్ధిక అవసరాలకు జేబుదొంగలు, పాతనేరస్తులు మళ్లీ పాతబాట పడతారంటున్నారు పోలీసు అధికారులు. అందుకే.. ప్రజలు కూడా రాబోయే ముప్పు నుంచి తప్పించుకునేందుకు అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఇటు కరోనా.. అటు క్రిమినల్స్ నుంచి తమను తాము కాపాడుకునే బాధ్యత ప్రజలదేనంటూ చెప్పేస్తున్నారన్నమాటే.