FbTelugu

శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభం

తిరుమల: శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. మొదటిరోజు శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు.
ఇవాళ ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేపుచేశారు. అక్కడ హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుంగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు.

యథావిధిగా శ్రీ‌వారి ద‌ర్శ‌నాలు: టీటీడీ ఛైర్మన్

భ‌క్తుల‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌నాలు య‌థావిధిగా ఉంటుందని, స్వామివారి అనుగ్ర‌హంతో కరోనా వ్యాధి పూర్తిగా తొలగిపోయి ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని టీటీడీ ఛైర్మ‌న్ వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. ప్ర‌తి ఏడాది తిరుమ‌ల శ్రీవారి ఆల‌యంలో ప‌విత్రోత్స‌వాలు నిర్వ‌హించ‌డం అన‌వాయితీగా వ‌స్తుంద‌న్నారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ‌ చ‌ర్య‌ల‌లో భాగంగా ఈ ఉత్స‌వాల‌ను ఆల‌యంలో మూడు రోజుల పాటు ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఛైర్మ‌న్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అద‌న‌పు ఈఓ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

You might also like