FbTelugu

ఆదిలోనే హంసపాదా..!

త్వరలో దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అయితే, దేశంలోని అందరి దృష్టీ బెంగాల్‌పై ఉంది. ఎలాగైనా అక్కడ పాగా వేయాలని బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ప్రస్తుత సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ కూడా తిరిగి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు కష్టపడుతున్నారు.

ఇక, సీపీఎం, కాంగ్రెస్‌ ఫ్రంట్‌ కూడా భారీగానే తన శక్తిని వినియోగిస్తోంది. అయితే, ఈ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీకి ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా పరిస్థితి మారిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక్కడ అధికారంలోకి రావడం కోసం టీఎంసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పలువురు నాయకులను నయానో బయానో తమవైపునకు తిప్పుకుంది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షాలు నిరంతరం ఈ రాష్ట్రంపై కన్నేశారు. అందినవచ్చిన అవకాశాలన్నింటినీ వినియోగించుకునే పనిలో పడ్డారు. దానిలో భాగంగానే పార్టీ ఫిరాయింపులు భారీగా నడిచాయి. ఇంతవరకు బీజేపీ పరిస్థితి బాగానే ఉంది. కానీ, అసెంబ్లీ సీట్ల కేటాయింపే ఆ పార్టీలో ముసలాన్ని సృష్టిస్తోంది. కొత్తగా పార్టీలో చేరిన వారిని దగ్గర తీస్తున్న నేతలు ఎప్పటినుంచో ఉన్న తమను పట్టించుకోవడం లేదన్న ఆగ్రహాన్ని బీజేపీ కార్యకర్తలు, నాయకులు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఏకంగా పార్టీ కార్యాలయాలకు వెళ్లి అక్కడ వస్తువును, కార్యాలయాలను కూడా ధ్వంసం చేస్తున్నారు. ఎంతో క్రమశిక్షణ కలిగిన పార్టీ, కార్యకర్తలు ఒక్కసారిగా ఇంత ఆగ్రహానికి గురవుతున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతోంది.

వాస్తవానికి బెంగాల్‌ కొన్నాళ్లుగా టీఎంసీ అరాచకం పెరిగిందని.. వారి చేతిలో సీపీఎం, కాంగ్రెస్‌తో పాటు బీజేపీ కార్యకర్తలు కూడా దాడులకు గురయ్యారని జోరుగా ప్రచారం సాగింది. ఇలా అనేకమంది బీజేపీ కార్యకర్తలు తమ ప్రాణాలకు తెగించి పార్టీకోసం పనిచేస్తే ఇప్పుడు కొత్తగా వచ్చిన వారికి టికెట్లిస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. వారంతా ఇప్పుడు బీజేపీ నేతలపై నిప్పుల వర్షం కురిపిస్తున్నారు. అధికారం తమదే అని నమ్మకంగా ఉన్న బీజేపీ నేతలకు ఈ పరిణామాలు కొరకరాని కొయ్యగా తయారయ్యాయని, ఆ పార్టీ ఆశలకు ఆదిలోనే అశనిపాతం అన్నట్టుగా తయారైందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కార్యకర్తల ఆగ్రహం బీజేపీ పడవను ఎక్కడకు తీసుకెళుతుందో.. పార్టీని ముంచుతుందో.. తేల్చుతుందో చూడాలి మరి.

You might also like

Leave A Reply

Your email address will not be published.