FbTelugu

ఆర్తీ సౌంద‌ర్య దీప్తి!

ఒక సిల్క్‌స్మిత‌.. మ‌రో దివ్య‌భార‌తి.. ఇంకొ ఫ‌టాఫ‌ట్ జ‌య‌ల‌క్ష్మి.. ఇలా చెప్పుకుంటూ పోతే.. నాటి మ‌హాన‌టి నుంచి.. ఇప్ప‌టి వ‌ర‌ల‌క్ష్మి వ‌ర‌కూ అంద‌మైన భామ‌ల క‌న్నీళ్లు తెర‌వెనుక చీక‌టిలో ఉండిపోయాయి. ఎన్నో విషాధాల‌ను మ‌న‌సులో దిగ‌మింగుతూ వెండితెర‌పై అందాల‌తో మైమ‌రిపించారు.

ఆ త‌రువాత దేవ‌క‌న్య‌లుగా తాము వ‌చ్చిన ప‌ని పూర్త‌యిన‌ట్టు అంత‌లోనే అంత‌ర్థాన‌మ‌య్యారు. ఈ జాబితాలో ఆర్తీఅగ‌ర్వాల్‌ను కూడా చేర్చ‌వ‌చ్చో.. లేదో కానీ.. ఆమె కూడా వెండితెర‌కు వ‌చ్చాక ఎన్నో ఎదురుదెబ్బ‌లు చ‌విచూశారు. అంద‌మైన మాట‌ల‌తో.. ప్రేమ అంటే న‌మ్మి మోస‌పోయింద‌నే సానుభూతి లేక‌పోలేదు. ఏమైనా. జిలుగువెలుగుల్లో  ఆమె సౌంద‌ర్యం.. ఇప్ప‌టికీ చెర‌గ‌ని జ్ఞాప‌కంగానే ప్రేక్ష‌కుల మ‌న‌సులో ఉండిపోయింది.

ఆర్తీ ఆగ‌ర్వాల్‌… నువ్వు నాకున‌చ్చావ్‌తో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సుదోచింది. కొద్దిస‌మ‌యంలోనే అగ్ర‌హీరోల స‌ర‌స‌న న‌టించి ఔరా అంటూ మెప్పించింది. అమెరికాలో లోని న్యూజెర్సీలో పుట్టారు. ఆర్తి  తండ్రి కౌశిక్ అగ‌ర్వాల్, త‌ల్లి వీమా అగ‌ర్వాల్‌. స్వ‌స్థ‌లం గుజ‌రాత్ అయినా వ్యాపార నిమిత్త‌మ అగ్ర‌దేశం వెళ్లారు.   ఫిల‌డెల్ఫియాలో జ‌రిగిన ఒక నృత్య‌ ప్ర‌ద‌ర్శ‌న‌కు  హీరో సునీల్‌శెట్టి  వెళ్లారు. ఆ ప్ర‌ద‌ర్శ‌న‌లో ఆర్తి అగ‌ర్వాల్ అద్భుత‌మైన నృత్యంతో అల‌రించారు. కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా అమితాబ్ బచ్చన్ కూడా వెళ్లారు. ఆర్తి అభిన‌యం చూసిన అమితాబ్‌.. సినిమాల్లోకి వ‌స్తే బావుటుందంటూ ఆర్తీ త‌ల్లిదండ్రుల‌కు సూచించారు. అప్ప‌టికి ఆర్తీ వ‌య‌సు కేవ‌లం 14 మాత్ర‌మే. అలా మోడ‌లింగ్ నుంచి వెండితెర వైపు అడుగులు ప‌డ్డాయి.

ముంబ‌యి వ‌చ్చిన ఆర్తీ న‌ట శిక్ష‌ణాల‌యంలో చేరి శిక్ష‌ణ పొందింది. బాలీవుడ్‌లో పాగ‌ల్‌పాన్ సినిమా ద్వారా న‌టిగా ప‌రిచ‌యం. ఆ త‌రువాత నువ్వు నాకున‌చ్చావ్‌లో నందినిగా అల‌రించారు. నాలుగైదేళ్ల వ్య‌వ‌దిలోనే ఇంద్ర‌, వ‌సంతం, ప‌ల్నాటి బ్ర‌హ్మ‌నాయుడు.. పెద్ద హీరోల‌తో నటిస్తూనే.. జూనియ‌ర్‌తో  అల్ల‌రి రాముడు, ప్ర‌భాస్‌తో అడ‌వి రాముడు, సునీల్‌తో అందాల ‌రాముడులోను న‌టించారు. 2005 మార్చిలో ఆమె ఆత్మ‌హ‌త్య‌య‌త్నం చేసుకున్నారు. త‌రుణ్‌తో త‌న‌కు సంబందం ఉన్న‌ట్టు వ‌స్తున్న పుకార్ల‌తో విర‌క్తి చెంది ఇలా చేసిన‌ట్టు పోలీసు విచార‌ణ‌లో వెల్ల‌డించారు. 2006లో ఇంట్లోని మెట్ల‌మీద నుంచి కింద‌ప‌డి గాయాల‌పాల‌య్యారు. 2007లో ఉజ్వ‌ల్‌ కుమార్ అనే వ్యాపారిని పెళ్లిచేసుకున్నారు. ఆ త‌రువాత కొన్నాళ్ల‌కే విడాకులు తీసుకున్నారు. ఆ త‌రువాత అమెరికా వెళ్లారు. అధిక ‌బ‌రువుతో బాధ‌ప‌డుతూ త‌గ్గేందుకు చాలా ప్ర‌య‌త్నాలు చేశారు. సినిమా అవ‌కాశాలు త‌గ్గ‌టంతో అతిథి పాత్ర‌లు కూడా చేయాల్సి వ‌చ్చింది. అలా మాన‌సిక ఒత్తిడికి గుర‌య్యారు. ఎలాగైనా బ‌రువును అదుపులోకి తెచ్చుకుని సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాల‌నుకున్నారు. 2015 జూన్ 4న అమెరికాలోని అట్లాంటిక్ సిటీలో లైపోసక్షన్ సర్జరీ  చేయించుకున్నారు. కానీ చికిత్స విక‌టించ‌టంతో జూన్ 6వ తేదీ 2015న  ఎగ్ హార్బర్ టౌన్ షిప్ లోని తన స్వగృహంలో క‌నుమూశారు.

You might also like