FbTelugu

ఇద్దరు సీఎం ల జగన్నాటకాలు కుదరవు: సంజయ్

హైదరాబాద్: సచివాలయం కూల్చడానికి గంటల కొద్దీ సమీక్షలు నిర్వహించిన సీఎం కేసీఆర్ కు వీడియో కాన్ఫరెన్స్ లో అరగంట మాట్లాడే సమయం లేదా అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు.

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై అపెక్స్ కమిటీ సమావేశం ఈ నెల 5న ఏర్పాటు చేస్తే, నెలాఖరుకు వాయిదా వేయాలని కేసీఆర్ కోరడమేంటని ప్రశ్నించారు. ఏపీ సీఎం జగన్ రెడ్డి సమయం అడిగే బదులు కేసీఆర్ ఎందుకు అడుగుతున్నారని, ఏం పీకుతున్నాడని ఆయన నిలదీశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య న‌డుసున్న జ‌లవివాద విష‌య‌మై తాను కేంద్ర మంత్రి కి పిర్యాదు చేయగా, ఇద్దరు సీఎం లతో ఆగస్ట్ 5 న సమావేశం ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు ఆ కేంద్ర మంత్రి తెలిపారన్నారు. జల వివాదాలపై కేంద్రం పై విమర్శలు చేస్తున్న సీఎం కేసీఆర్.. ఏపీ పై, జగన్ పై ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్ర‌శ్నించారు.

జగన్ తన బండారం బయట పెడతాడు అని కేసీర్ భయపడుతున్నాడని అన్నారు. ఇద్దరు సీఎం లు కలిసి రాష్ట్రాన్ని దోచుకుందామనుకుంటున్నారని, సెంటిమెంటును వాడుకొని లబ్ది పొందాలని చూస్తున్నారని అన్నారు. బీజేపీ ఇద్దరు సీఎం ల ఆగడాలను, అరాచకాలను అడ్డుకుంటుందని, పక్క రాష్ట్రాల సీఎం లను కలుపుకుని బలం పెంచుకున్నా భయపడేది లేద‌ని సంజయ్ స్పష్టం చేశారు. త‌మ పార్టీ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని, రీ డిజైన్ ల పేరుతో దండుకోవడానికి వ్యతిరేకమ‌ని అన్నారు.

You might also like