FbTelugu

ప్రత్యేక విమానాల్లో వెనక్కి

ఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా విదేశాలలో చిక్కకుకున్న ఇండియన్స్ ను వెనక్కి రప్పించాలని కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నది.

లెక్కలు పంపించాలంటూ భారత విదేశాంగ శాఖ రాయబార కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. మే 3వ తేదీ తర్వాత లాక్‌డౌన్‌కు కొన్ని సడలింపులు ఇచ్చి విదేశాల్లో ఉన్న భారతీయుల కోసం ప్రత్యేక విమానాలు నడపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.  విదేశాల్లో చిక్కుకుపోయిన వారి కుటుంబసభ్యలు తమ వారిని స్వదేశానికి తీసుకురావాలని కోరుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే వారిని వెనక్కి తీసుకురావడానికి ప్రత్యేకంగా విమానాలు పంపాలని కేంద్రం నిర్ణ‌యించింది. విదేశాల్లో చిక్కుకుని ఉన్నవారి పూర్తి వివరాలను కేంద్ర ప్రభుత్వం సేకరిస్తోంది.  ఆయా దేశాల భారత రాయభార కార్యాలయ సిబ్బంది ఈ పనిలో నిమగ్నమయ్యారు.

ఇతర దేశాల నుంచి వచ్చే ఇండియన్స్ కోసం హాస్పిటల్స్, క్వారంటైన్ జోన్లను సిద్ధం చేయాల్సిందిగా కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను కోరారు.

కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తచెందుతుండడంతో కేంద్రం ప్రభుత్వం గత నెల 22వ తేదీన అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసింది. విద్య, ఉద్యోగ, ఉపాధి, పర్యాటకానికి వివిధ దేశాలకు వెళ్లిన ఎంతో మంది భారతీయులు విదేశాల్లో చిక్కుకుపోయారు. వారంతా తిరిగి భారత దేశానికి చేరుకోలేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

You might also like