FbTelugu

చిన్నారి మొహంలో ఎన్ని ప్రశ్నలో..

పాలబుగ్గల చిన్నారి. నిండా మూడేళ్లు నిండని వయస్సు. తనచుట్టూ ఏం జరుగుతుందో తెలియని పసితనం.

కరోనా అంటే ఏమిటో తెలియదు.. లాక్‌డౌన్‌ అంటే అర్ధం కాని వయస్సు.. కడుపులో పేగులను మెలిపెడుతున్న ఆకలి. ఆకలి ఎందుకు అవుతుందో తెలియని అమాయకత్వం. ఆ ఆకలిని తీర్చుకునేందుకు తనకు అన్నం ఎందుకు దొరకడం లేదో కూడా తెలియని పసి హృదయం. తన ఆకలి బాధను తీర్చుకునేందుకు అన్నార్తులకు సాయం అందించే వాహనం వద్ద లేలేత చేతులు చాచి అడుక్కుంటున్న దృశ్యం.

పాషాణ హృదయులకు సైతం కన్నీరు పెట్టించే సన్నివేశం. ఆ చిన్నారి మొహంలో కనిపించే ఆందోళనకు కన్నీరు కార్చకుండా ఉండలేని దుస్థితి. ప్రభుత్వాలు ప్రకటించే ఉద్దీపనలేవీ ఉద్దరించలేని పరిస్థితి. ప్రపంచమంటేనే ఏమిటో తెలియని వయస్సులోనే కడుపు నింపుకునేందుకు పిడికెడు అన్నం కోసం వెతుకుతున్న అమాయకపు కళ్లు. ఇదీ.. కరోనా కాలంలో ఓ చిన్నారి పడుతున్న అవస్థ. ఈ దృశ్యం హైదరాబాద్‌ నగరంలో ఎంతోమందిని కన్నీరు పెట్టించింది.

ఈ చిన్నారి తల్లిదండ్రులు మెదక్‌ జిల్లా పరిసర ప్రాంతంలోని ఇటుక బట్టీలో పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌ ప్రభావంతో పనులు నిలిచిపోయాయి. దీంతో వారి స్వంత గ్రామమైన నారాయణపేట జిల్లాకు బయలుదేరారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలోకి కాలినడకన చేరుకున్నారు. అప్పటికే కడుపులో ఆకలి బాధ ఎక్కువైంది. అక్కడే నీళ్లు తాగి కాసేపు సేదదీరారు. అదే సమయంలో అక్కడకు ఒక వాహనం వచ్చి ఆగింది. చుట్టుపక్కల ఉన్న వాళ్లు పొలోమంటూ అక్కడకు చేరి అందులో ఉన్న ఆహార పొట్లాలు తీసుకున్నారు. ఈ చిన్నారి తల్లిదండ్రులు విషయం తెలసుకొని అక్కడికి వెళ్లే సరికి ఆహార పొట్లాలు అయిపోయాయి.

ఆ చిన్నారి ఆకలికి తట్టుకోలేక పోతున్నాడు. ఆహార పొట్లాలు తీసుకొని తింటున్న వారిని చూసిన చిన్నారి తనకు కూడా ఇస్తారేమోనని వెళ్లి తన లేలేత చేతులు చాచి అన్నం అడుగుతున్నాడు. కానీ, అప్పటికే వాహనంలోని ఆహారం అయిపోయిందని, తన ఆకలి బాధ తీరేమార్గం లేదని తెలియని ఆ అమాయకపు చేతులు వాహనం అక్కడ నుంచి వెళ్లేంత వరకూ అలా చాచుకునే ఉన్నాయి. లాక్‌డౌన్‌ కాలంలో ఇలాంటి చిన్నారి చేతులు ఎన్నో బుక్కెడు బువ్వకోసం ఇంకా చాచుకునే ఉన్నాయి. కానీ, ఆ చేతిలో నాలుగు మెతుకులు పెట్టేవారే కరువయ్యారు. పేదల కోసం ఎన్నో ఉద్దీపనలు ప్రకటిస్తున్న నేతల మాటలు విని వాటికోసం ఆశపడడం తప్ప అవి తమ దరికి చేరవన్న సంగతి తెలియని జనం ఇంకా మోసపోతూనే ఉన్నారు.

You might also like