FbTelugu

పెట్రోల్ ధరలపై సీఎం కేంద్రంపై ఒత్తిడి తేవాలి: బాబు

అమరావతి: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేందుకు సీఎం జగన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.
కరోనాతో ప్రజలకు, వ్యాపారులకు ఆదాయం బాగా తగ్గి పీకల్లోతు కష్టాల్లో, నష్టాల్లో ఉన్నారన్నారు. ప్రజల, వ్యాపార సంస్థల కొనుగోలు శక్తి పెంచి ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ప్రజలకు అనేక రాయితీలు ఇస్తున్నవి అని గుర్తు చేశారు. ప్రజలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంచడం మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందమే అవుతుందన్నారు.

కనుక ప్రజల తక్షణ ఉపశమనం కోసం జగన్ ప్రభుత్వం అదనంగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను రద్దు చేయాలి. 2018లో టీడీపీ ప్రభుత్వం మానవతా దృక్పధంతో పెట్రోల్, డీజిల్ పై రూ.2 చొప్పున తగ్గించిన స్థితిని స్ఫూర్తిగా తీసుకుని జగన్ ప్రభుత్వం పెంచిన ధరలు తగ్గించాలని చంద్రబాబు అన్నారు.

గత రెండు వారాలుగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్ర రవాణ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ పెరుగుదల వల్ల రాష్ట్ర రవాణరంగంపై ఏటా రూ.3893 కోట్ల భారం పడుతోందన్నారు. సామాన్యుడు వినియోగించే ద్విచక్ర వాహనాలు వాడలేని పరిస్థితి నెలకొంటుందన్నారు. కాబట్టి తక్షణమే జగన్మోహన్ రెడ్డి డీజిల్ పై పెంచిన వ్యాట్ ను రద్దు చేయాలని చంద్రబాబు నాయుడు కోరారు.

You might also like