హైదరాబాద్: ఇన్నాళ్లూ రైతులు కనపడలేదా, వాళ్ల కష్టాలు ఇప్పుడే గుర్తుకు వచ్చాయా అంటూ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని కొందరు నిలదీయడంతో ఆయనకు కోపమొచ్చింది.
ఇంకేముంది ఆయన అనుచరులు నిలదీసినవారిపై దాడికి దిగారు. ఈ ఘటన ఉషా ముళ్లపూడి కమాన్ వద్ద జరిగింది. టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఎమ్మెల్యే గాంధీ కమాన్ వద్దకు చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. అదే దారిలో వస్తున్న కొందరికి కోపమొచ్చింది. మీకు రైతులు ఇప్పటి వరకు కన్పించలేదా, వాళ్లు పడే కష్టాలు తెలియవా అంటూ ఒక మహిళతో పాటు స్థానికులు ఎమ్మెల్యే గాంధీని నిలదీశారు. కేంద్రాన్ని బదనాం చేసేందుకు ఇదొక అవకాశం దొరికిందా అంటూ మండిపడ్డారు.