FbTelugu

ప్లాన్‌ ఫలిస్తుందా..?

బెంగాల్‌లో రాజకీయం రసవత్తరంగా మారింది. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తమయ్యాయి. గెలుపే అజెండాగా ముందుకు సాగుతున్నాయి. బెంగాల్‌ రాజకీయాల్లో అత్యధిక కాలం సీఎం పీఠాన్ని అధిరోహించింది సీపీఎం. కానీ, నందిగ్రామ్‌లో పేదల భూములను బలవంతంగా లాక్కుంటున్నారన్న అంశంపై అక్కడి రైతులు సీపీఎంపై పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఈ ఆందోళనలో జరిపిన కాల్పుల్లో పలువురు మరణించారు. అనేకమంది గాయాలపాలయ్యారు. దీంతో ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బెంగాల్‌ ప్రజలు సీపీఎం కూటమిని ఓడించి తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీని పీఠం ఎక్కించారు. అప్పటి నుంచి సీఎంగా ఆమే ఉన్నారు. కానీ, ఇప్పుడు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ను ఢీకొట్టేందుకు విపక్షాలు అనేక రకాల ప్లాన్లు వేస్తున్నాయి. అందులో భాగంగానే తిరిగి రాష్ట్రంలో పుంజుకునేందుకు సీపీఎం కూడా భారీ ప్లాన్‌ వేసింది. అక్కడ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులుగా యువతకు ప్రాధాన్యం ఇచ్చింది. యువత అంటే ఇప్పటికే ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ సంఘాల్లో చురుగ్గా పాల్గొంటూ అధికార పక్ష దాడులను ఎదుర్కొని ప్రజా పోరాటాల్లో ముందున్న యువతీ యువకులకు ప్రాధాన్యం ఇచ్చింది. స్వచ్ఛమైన రాజకీయాలు వారితోనే సాధ్యమన్న ఆలోచనతో యువతకు సీపీఎం పెద్దపీట వేసింది. యువ అభ్యర్థులు కూడా వారి ఆలోచనలకు అనుగుణంగా వృద్ధ నేతల సలహాలు, సూచనలతో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. వారి ప్రచారానికి జనం కూడా భారీగానే మద్దతు తెలుపుతున్నట్టుగా పరిణామాలు కనిపిస్తున్నాయి. సీపీఎం నిర్వహించే సభలకు లక్షలాదిగా జనం తరలివస్తున్నారు. ఇంటింటి ప్రచారంలో కూడా జనం వారివెంట నడుస్తున్నారు.

యువత రాజకీయాల్లోకి వస్తే మంచి జరుగుతుందన్న నమ్మకంతో గ్రామీణ మహిళలు సైతం ఆ యువ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అంతేకాదండోయ్‌ ఎన్నడూ రాజకీయాల కోసం బయటకు రాని గ్రామీణ యువతులు సీపీఎం అభ్యర్థుల తరఫున పోస్టర్లు అంటించడం, ఇల్లిల్లూ తిరిగి ప్రచారం నిర్వహించడం, చివరకు వాల్‌రైటింగ్‌ కూడా చేస్తున్నారంటే యువ అభ్యర్థులకు ఎలాంటి మద్దతు లభిస్తుందో అర్ధమవుతూనే ఉంది. ఈ పరిస్థితులను గమనించే సీపీఎం నాయకత్వం యువతను ముందుకు తెచ్చింది. భావి తరాలు బాగుండాలంటే యువనాయకత్వం రావాలన్న ఆలోచనతో పాటు బెంగాల్‌లో పూర్వస్థాయిని సాధించేందుకు వేసిన ఈ ప్లాన్‌ ఏమాత్రం వర్కవుట్‌ అవుతుందో చూడాలి.

You might also like

Leave A Reply

Your email address will not be published.