FbTelugu

పెద్దాయన అంచనాల్లో ఫెయిలవుతున్నారా..

తెలంగాణకు పెద్ద దిక్కు కేసీఆర్‌. రాష్ట్రంలో ఆయన ఏది చెబితే అది కచ్చితంగా జరిగి తీరుతుందన్నది చాలావరకు వాస్తవమే. దీనిని అందరూ ఒప్పుకుంటారు. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజకీయాల్లో.. మరీ ముఖ్యంగా తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ఆయన చెప్పిన మాట ప్రకారమే జరిగాయి.

దీంతో ఆయన అంచనాలు.. ప్రధానంగా టీఆర్‌ఎస్‌ పార్టీ వైభవాలు, విజయాలు అన్నింటినీ ఆయన ముందుగానే పసిగడతారని.. కచ్చితమైన అంచనా వేస్తారన్న పేరుంది. కానీ, ఇటీవల కాలంలో చూస్తే ఆయన అంచనాలన్నీ తలకిందులవుతున్నాయి. ఎన్నికల ఫలితాల దగ్గర నుంచి సొంత పార్టీ విజయాల వరకూ అన్నింటిలోనూ ఆయన ఫెయిలవుతున్నారు. ఆయన అంచనాలు తలకిందులవుతున్నాయంటే ప్రజల నాడిని ఆయన పసిగట్టలేక పోతుండడమే కారణమన్న వాదన కూడా వినిపిస్తోంది. ఎంతసేపు తన మాటే వేదమని భావిస్తున్న ఆయన ఆలోచనలకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోందని.. అందులో భాగంగానే ఆయన అంచనాలు తారుమారు కావడం, టీఆర్‌ఎస్‌ అపజయాలు పొందడమని రాజకీయ పండితులు భావిస్తున్నారు. గత పార్లమెంటు ఎన్నికలకు ముందు వరకు ఫలితాలు ఎలా రాబోతున్నాయి. టీఆర్‌ఎస్‌ ఎలా విజయం సాధిస్తుంది. ఎన్ని స్థానాలు తాము గెలుస్తామన్న విషయాలను కచ్చితంగా చెప్పేవారు. ఫలితాలు కూడా ఒకటి అరా అటు ఇటుగా తప్ప ఆయన అంచనాలకు దగ్గరగానే ఉండేవి. కానీ, మొదటి సారిగా ఆయన అంచనాలు గత పార్లమెంటు ఎన్నికల్లో దెబ్బకొట్టాయి. రాష్ట్రంలో ఉన్న 16 స్థానాలనూ టీఆర్‌ఎస్‌ సునాయాసంగా గెలుచుకుంటుందని చెప్పారు. ఆ నమ్మకంతోనే కారు.. సారు.. పదహారు అని జోరుగా ప్రచారం చేశారు. కానీ, ఆ ఎన్నికల ఫలితాలు ఆయనకు దిమ్మతిరిగేలా వచ్చాయి.

16 స్థానాల్లో కేవలం తొమ్మిదింటిని మాత్రమే సాధించారు. ఈ ఎన్నికల్లో అందరి అంచనాలను తారుమారు చేస్తూ బీజేపీ నాలుగు, కాంగ్రెస్‌ మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఇకక చేవెళ్ల స్థానంలో కాంగ్రెస్‌ పార్టీ గట్టి పోటీనిచ్చింది. ఇక్కడ టీఆర్‌ఎస్‌ చావుతప్పి కన్ను లొట్టబోయినట్టుగా సాధారణ మెజారిటీతో గట్టెక్కింది. ఇందులోనూ నిజామాబాద్‌ స్థానం నుంచి కేసీఆర్‌ కూతురు కవిత దారుణంగా ఓటమి పాలు కావడం కేసీఆర్‌తో పాటు టీఆర్‌ఎస్‌కు దిమ్మతిరిగేలా చేసింది. తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు పరాజయమే ఎదురైంది. నిజామాబాద్‌ పట్టభద్రుల స్థానానికి జరిగిన ఎన్నికలో కాంగ్రెస్‌ విజయం సాధించింది. నల్లగొండ–వరంగల్‌– ఖమ్మం పట్టభద్రుల స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి నాలుగో విడత ఓట్లతో తక్కువ మెజారిటీతో బయట పడ్డారు. ఇక, నల్లగొండ–ఖమ్మం–వరంగల్‌ ఉపాధ్యాయ స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పీఆర్‌టీయూ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. కానీ, ఈ ఎన్నికలోనూ టీఆర్‌ఎస్‌ ప్రతికూల ఫలితాలే వచ్చాయి. ఇక్కడ టీఆర్‌ఎస్‌ మద్దతుతో బరిలోకి దిగిన సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పూల రవీందర్‌పై యూటీఎఫ్‌ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి సునాయాసంగా విజయం సాధించారు. అనంతరం దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలోనూ కేసీఆర్‌ అతిగా స్పందించారన్న ప్రచారం జోరుగా సాగింది. ఈ స్థానంలో టీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తుందని, అసలు ఈ ఎన్నిక గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదన్నారు. ఈ ఉప ఎన్నిక తమకు ఒక లెక్కే కాదని ధీమాగా చెప్పారు. పైగా బీజేపీ దుబ్బాకలో ఎక్కుడుంది.. ఆ పార్టీకి డిపాజిట్‌ కూడా రాదని, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాత లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని, సర్వేలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయని ఢంకా బజాయించి చెప్పారు. కానీ, ఈ ఎన్నికలోనూ టీఆర్‌ఎస్‌ దారుణంగా పరాజయం పాలైంది. లక్ష ఓట్ల మెజారిటీ ఖాయమని చెప్పిన కేసీఆర్‌ పార్టీకి వచ్చిన ఓట్లు కేవలం 62వేలు మాత్రమే. దుబ్బాకలో బీజేపీ ఎక్కడుంది అన్న ఆయన మాటలు నిజం కాదని.. దుబ్బాక గడ్డపై బీజేపీ జెండా ఎగిరింది. ఇలా పార్లమెంటు ఎన్నికల నుంచి నేటిదాకా జరిగిన ప్రతి ఎన్నికలోనూ కేసీఆర్‌ అంచనాలు తారుమారవుతున్నాయి.

ఇప్పుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని, వందకు పైగా స్థానాలను టీఆర్‌ఎస్‌ గెలుచుకుంటుందని.. సర్వేలన్నీ ఇవే చెబుతున్నాయని కార్యకర్తలకు చెబుతున్నాడు. కానీ, వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తే కేసీఆర్‌ చెప్పినట్టుగా వాతావరణం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, అందులో భాగంగానే ప్రచారానికి వెళ్లిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను స్థానికులు అడ్డుకొని సమస్యలపై ప్రశ్నిస్తున్నారన్న వార్తలు నిత్యం చూస్తూనే ఉన్నాం. వారికి సమాధానం చెప్పలేక చాలాప్రాంతాల్లో ఎమ్మెల్యేలు ప్రచారాన్ని రద్దు చేసుకొని తిరిగి వెళ్తున్నారు. ఈ పరిస్థితి కేవలం టీఆర్‌ఎస్‌కే కాదు.. వారికి మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎంకు కూడా ఎదురవుతోంది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్‌ అంచనాలు మళ్లీ తలకిందులవుతాయా.. లేక ఆయన అంచనాలే ఫలితాల్లో ప్రతిబింబిస్తాయా అని తెలంగాణ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.