FbTelugu

అమెరికాను దాటేస్తున్నామా..?

అమెరికాను దాటేసేలా ఉంది పరిస్థితి చూస్తుంటే.. అమెరికాను దాటేస్తున్నామంటే అభివృద్ధిలో ఇండియా అంతగా అభివృద్ధి చెందుతుందా అన్న అనుమానం వచ్చిందా.. కాదండి అమెరికాను దాటేసేదాకా వచ్చామంటే అది అభివృద్ధిలో కాదు.

కరోనా కేసుల్లో. అవును మరి. ఇప్పటివరకు కరోనా కేసుల్లో అమెరికా ప్రపంచంలోనే అగ్రభాగాన నిలిచింది. ఇండియా ఈ విషయంలో ఒక్కో మెట్టు దాటుకుంటూ రెండోస్థానానికి చేరింది. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే మరికొన్ని రోజుల్లోనే ప్రపంచంలో మొదటి స్థానానికి చేరే ప్రమాదం కనిపిస్తోంది. ప్రస్తుతం అమెరికాలో సోమవారం నాటికి 67లక్షల 21వేల 588 కేసులు నమోదైతే ఇండియాలో మాత్రం 48లక్షల 46వేల 427 కేసులు నమోదయ్యాయి. వీటి మధ్య తేడా చాలా కనిపిస్తున్నప్పటికీ ప్రతిరోజూ నమోదవుతున్న కేసుల సంఖ్య అమెరికా కంటే ఇండియాలో భారీగా ఉంటోంది.

సోమవారం అమెరికాలో 27,419 కేసులు నమోదైతే ఇండియాలో మాత్రం 92,071 కేసులు నమోదయ్యాయి. అంటే ఒక్కరోజులోనే నాలుగు రెట్లు కేసులు అమెరికా కంటే ఎక్కువ నమోదయ్యాయి. ఇక ఆదివారం అమెరికాలో 41,448 కేసులు నమోదైతే ఇండియాలో 94,372 కేసులు నమోదయ్యాయి. ఇటీవల కాలంలో ఈ రెండు దేశాల మధ్య ఇంత భారీ తేడాతో కేసులు నమోదు కావడంతో త్వరలోనే ఇండియా అమెరికాను దాటి కరోనా కేసుల విషయంలో ప్రపంచంలోనే మొదటి స్థానానికి చేరవచ్చని ఇండియా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

వాస్తవానికి ఇండియాలోని చాలా రాష్ట్రాలు ఇంకా చాలా తక్కువగా కరోనా టెస్టులు చేస్తున్నాయి. దీంతో కేసుల సంఖ్య చాలా తక్కువగా కనిపిస్తోందని, టెస్టుల సంఖ్య పెంచితే ఈ పాటికే అమెరికాను దాటేసే వాళ్లమని చాలామంది అభిప్రాయపడుతున్నారు. కరోనా కేసుల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం చర్చలు తీసుకుంటున్నా.. ఇంకా మెరుగైన చర్యలు చేపడితేనే ఈ మహమ్మారి నుంచి దేశం బయటపడుతుందని ఇండియా వాసులు అభిప్రాయపడుతున్నారు.

You might also like