FbTelugu

అది నిజమేనా…

రాజకీయాల్లో ఆరోపణలు.. ప్రత్యారోపణలు చూస్తుంటాం. చాలా గమ్మత్తుగా ఉంటాయి. అవతలి వ్యక్తులను, పార్టీలను టెన్షన్‌ పెట్టేందుకే కొన్ని వ్యాఖ్యలు చేస్తుంటారు. కొందరు నేతల మీద అవినీతి ఆరోపణలు భారీ స్థాయిలో చేస్తారు. వారి అవినీతికి సంబంధించిన అన్ని ఆధారాలు మా వద్ద ఉన్నాయి.. వాటిని త్వరలోనే బయటపెడతానని కూడా చెబుతారు. కానీ, అవి ఎప్పటికీ బయటపెట్టరు. ఇలాంటి ఘటనలు మనం చాలా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తెలంగాణలో టీఆర్‌ఎస్‌పై బీజేపీ రాష్ట అధ్యక్షుడు పేల్చిన బాంబు ఎలాంటిదోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందరూ షాక్‌ అయ్యే వ్యాఖ్యలు చేయడంతో రాష్టవ్యాప్తంగా దీనిపై జోరుగా చర్చ సాగుతోంది.

కాంగ్రెస్‌తో పాటు టీఆర్‌ఎస్‌కు చెందిన 30మంది దాకా ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని ఒక్కసారిగా బాంబ్‌ పేల్చారు. వారే కాదు.. జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు కూడా తమ పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని చెప్పారు. అయితే తాము ప్రజాస్వామ్య పద్ధతులకు విరుద్ధంగా వెళ్లబోమని ఆయన తేల్చిచెప్పారు. అందుకే వారిని పార్టీలోకి తీసుకోవడం లేదన్నారు. ఈ వ్యాఖ్యలను చూస్తుంటే ఏవిధంగా అర్ధం చేసుకోవాలో అర్ధం కావడం లేదని రాజకీయ పండితులు కూడా తలలు పట్టుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని బీజేపీ విమర్శలకు దిగుతోంది. తాము అధికారంలోకి వస్తే మంచి పాలన అందిస్తామని కూడా చెబుతోంది. అయితే, టీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలు తీరాలంటే బీజేపీ అధికారంలోకి రావడం తప్ప మరోమార్గం లేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరి వారికి ప్రజలపై అంత ప్రేముంటే కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ నుంచి వచ్చే ఎమ్మెల్యేల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు కదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ వారి మద్దతు తీసుకోవడం అనైతికం అని భావిస్తే వారితో రాజీనామాలు చేయిస్తే ప్రభుత్వం పడిపోతుంది కదా.. అప్పుడు మళ్లీ ఎన్నికలు జరిగితే తామే గెలిచి మంచి పాలన అందించవచ్చు కదా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

అయితే, ఇటీవల కాలంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ టీఆర్‌ఎస్‌పై ఒంటికాలిపై లేస్తున్నారు. పైగా ప్రజల్లో బాగా చర్చ జరిగేలా వ్యఖ్యలు చేస్తున్నారు. ఈ తరుణంలో సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు నిజమేనా.. 30మందికి పైగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలో టచ్‌లో ఉన్నారా.. లేక టీఆర్‌ఎస్‌ నేతల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకే ఈ వ్యాఖ్యలు చేశారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నేతలు మాత్రం ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నాయి. ఒకవేళ సంజయ్‌ చెప్పిందే నిజమైతే వారితో టచ్‌లో ఉన్న వారెవరో బయట పెట్టవచ్చు కదా అని సవాల్‌ విసురుతున్నారు. అయితే, బండి సంజయ్‌ వ్యాఖ్యల్లో ఎంత నిజముందో తేలాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే మరి.

You might also like

Leave A Reply

Your email address will not be published.