FbTelugu

కరోనా సేవలు పెద్దలకేనా?

కరోనా సమయంలో పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి కోల్పోయి తినడానికి తిండిలేక దాతలు ఇచ్చే ఆహారపొట్లాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

వారిచ్చే ఒక్క పొట్లాన్నే మూడు పూటలా తిని అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఇలా ఇబ్బంది పడుతున్న వారిలో వలస కూలీలు ఎక్కువమంది ఉన్నారు. వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కూలిపనులు ఇస్తానని తీసుకొచ్చిన యజమానులు కూలి ఇవ్వడం మానేశారు. ఉండే చోటునుంచి తరిమేశారు. ఉపాధి లేక.. తినడానికి తిండి లేక, ఉండడానికి నీడ లేక ఇంటిబాట పట్టారు. వందల కిలోమీటర్ల దూరమైనా లెక్కచేయకుండా రోడ్డు మార్గాలు, రైలు పట్టాల మీదుగా నడక సాగిస్తున్నారు. మార్గమధ్యంలో ఎవరైనా ఇంత అన్నం పెడితే తినడం.. లేకుంటే పస్తులతోనే నడవడం. చిన్నా పెద్దా తేడా లేదు.

తమవారిని కలుసుకోవాలన్న ఆశ.. ఇంటివద్ద చిన్నారులు, వృద్దుల పరిస్థితి ఏమిటోనన్న ఆందోళన, వారు తింటున్నారో.. పస్తులుంటు న్నారోనన్న ఆవేదన వారిని వందల కిలోమీటర్లు నడిపిస్తోంది. ఈ నడకలో కాళ్లకు గాయాలై రక్తం కారుతున్నా.. రోడ్డుపైనే ప్రసవించి పచ్చిపుండుగా మారిన శరీరమైనా.. చివరకు నడిచి నడిచి ప్రాణాలు పోతున్నా నడక ఆగడం లేదు. నడక ఆపితే ఇంటికి చేరలేం.. ఎవరూ తమను ఆదుకోరన్న నమ్మకం వారిలో మరింత కసిని పెంచుతోంది. వేలాది మంది రోడ్డుమీదుగా నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కానీ, ప్రభుత్వాలు మాత్రం సరిగా స్పందించడం లేదు. తూతూ మంత్రంగా వారికి వాహనాలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నాయి.

అయితే, పెద్దల విషయంలో మాత్రం ప్రభుత్వాలు చాలా ఉత్సాహంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. విదేశాలకు చెందిన వారిని అక్కడకు.. అక్కడున్న స్వదేశస్తులను ఇక్కడకు తీసుకురావడానికి ప్రత్యేకంగా విమానాలు నడిపారు. కానీ, వలస జీవులు ఇంటికి వెళ్లడానికి మాత్రం కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నారు. వారికోసం కొన్ని రైళ్లను పునరుద్ధరించామని చెబుతున్నా అవన్నీ పెద్దలు ప్రయాణించే ఏసీ రైళ్లే. వాటిలో ప్రయాణించాలంటే వలసకూలీలకు తాహతుకు మించిన పనే. అసలే తినడానికి కూడా తిండిలేని పరిస్థితుల్లో వారు అంత చార్జీలు చెల్లించి ఏసీ రైళ్లలో ఎలా ప్రయాణిస్తారో ఆ ప్రభుత్వ పెద్దలకే తెలియాలి. ఏతా వాతా జనం చెప్పేదేంటంటే కరోనా కాలంలో కూడా ప్రభుత్వ సేవలన్నీ పెద్దలకోసమే తప్ప పేదల కోసం ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

You might also like