FbTelugu

వ్యాక్సిన్ కంపెనీలకు కులం గబ్బు: అచ్చెన్నాయుడు

అమరావతి: రాష్ట్రంలో వైసిపి పాలన ఎలా ఉందంటే… కరోనా వ్యాక్సిన్లు తయారు చేసే కంపెనీలకు కూడా కులం ఆపాదిస్తున్నారని ఏపి టిడిపి అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు విమర్శించారు. భారత్ బయోటెక్ కమ్మ కులం వారిని, మాజీ సిఎం చంద్రబాబు నాయుడు, ఈనాడు పత్రిక రామోజీరావు బంధువులదని ప్రచారం చేస్తున్నారని అన్నారు.
విజయవాడ నుండి అసెంబ్లీ వరకు మాస్కులు పెట్టుకొమ్మంటూ హోర్డింగ్స్ పెట్టారు కానీ.. ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి మాత్రం మాస్కు పెట్టుకోలేదని ఆయన అన్నారు. ఇవాళ టిడిపి అసెంబ్లీ, మండలి సమావేశాలను బహిష్కరించి మాక్ అసెంబ్లీ నిర్వహించింది. ఈ మాక్ అసెంబ్లీలో కె.అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, మార్చిలో 900 కేసులున్నపుడు కరోనా అన్నారు.. నేడు 22వేల కేసులు నమోదు అవుతున్నా జాగ్రత్తలు పాటించడం లేదన్నారు. ఒక్కరోజు బడ్జెట్ పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. ఆక్సిజన్ ఇవ్వలేని అసమర్ధుడు ముఖ్యమంత్రిగా మనకు అవసరమా.? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మోనార్క్ లా వ్యవహరిస్తూ ప్రాణాలు తీస్తున్నారు. కరోనా నియంత్రించాల్సింది పోయి.. చనిపోయాక రూ.15వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. గౌరువాని శ్రీనివాసులు మాట్లాడుతూ, చంద్రబాబు పాలనలో సీఎం అంటే.. క్రైసిస్ మేనేజర్ అనేలా పని చేశారు. ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాల సమయంలో చంద్రబాబు చొరవ అభినందనీయమన్నారు. వరంగల్ లో రైలు ప్రమాదం జరిగినపుడు.. జిల్లా కలెక్టర్ కంటే ముందు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. కరోనా నియంత్రణలో తమిళనాడు సీఎం ఎంకె.స్టాలిన్ ప్రతిపక్షాలకు ఇచ్చిన ప్రాధాన్యం చూడాలన్నారు. అమ్మ క్యాంటీన్లు అదే పేరుతో కొనసాగిస్తున్నారని కీర్తించారు.

కరోనా సమయంలో కుటుంబానికి రూ.4వేల చొప్పున ఆర్ధిక సాయం అందిస్తున్నారు. ఇక్కడ మాత్రం మన ముఖ్యమంత్రి ప్రజల గురించి ఏరోజూ పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రతిపక్షాలను హేళన చేయడమే పనిగా పెట్టుకున్నారు. తిరుపతి రుయా హాస్పిటల్ లో 11 మందే చనిపోయారని ప్రభుత్వం చెబుతున్నదని, వాస్తవ మరణాలు 40కి పైనే ఉన్నాయన్నారు. ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ, కరోనాతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 25వేల మందికిపైగా చనిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం వాస్తవ లెక్కలు బయటపెట్టడం లేదని విమర్శించారు. మట్టి ఖర్చుల కింద ఇస్తామన్న రూ.15వేలు కూడా అందడం లేదన్నారు. ప్రజారోగ్యం గురించి కాకుండా.. ప్రతిపక్షాలపై కక్ష సాధింపులపైనే దృష్టి పెట్టిందని ఆయన ఆరోపించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.