FbTelugu

సైకిల్ దిగారు.. ఫ్యాన్ కింద‌కు ఎప్పుడో!

క‌ర్ర విర‌గొద్దు.. పామూ చావ‌నూ వ‌ద్దు. ఇదీ వైసీపీలోకి చేర‌దామ‌ని భావిస్తున్న తెలుగు నేత‌ల ప‌రిస్థితి. ఒక వ‌ల్ల‌భ‌నేని వంశీ, క‌ర‌ణం బ‌ల‌రాం, మ‌ద్దాల‌గిరి అన‌బడే ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ ను బ‌ల‌ప‌రిచారు. జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి పాల‌న‌కు ముగ్దుల‌య్యారు. త‌మ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కోసం జ‌గ‌న్‌తో జ‌త‌క‌ట్టారు. ప‌చ్చిగా చెప్పాలంటే.. ఆ ఎమ్మెల్యేల‌పై చ‌ర్య తీసుకునేందుకు టీడీపీ అధినేత‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండా చేశారు. ఏ ఎమ్మెల్యే, ఎంపీల‌ను రాజీనామా చేయ‌కుండా త‌న పార్టీలోకి చేర్చుకోన‌నే జ‌గ‌న్ మోహ‌నుడి మాట‌ను నిలెబెట్టారు. మొన్నీ మ‌ధ్య ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి టీడీపీ ఖాళీ అంటూ ట్వీట్ చేశారు. జూన్ 19న జ‌రిగే అద్భుతం చూడండ‌హో అంటూ మ‌రీ హింట్ ఇచ్చారు. కానీ.. ఎవ్వ‌రూ సైకిల్ దిగ‌లేదు. వాస్త‌వానికి తాజా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా జ‌గ‌న్ పంచ‌కు చేరాల‌ని తెగ ఉవ్విళ్లూరుతున్నార‌ట‌.

టీడీపీ భవిష్య‌త్‌పై వారిలో ఏర్ప‌డిన అనుమానాలే దీనికి కార‌ణ‌మ‌నే ప్ర‌చారం లేక‌పోలేదు. అయితే.. ఇంత‌లో క‌రోనా విజృంభ‌ణ‌.. అచ్చెన్న‌, కొల్లు వంటి మాజీ మంత్రుల అరెస్టుల‌తో కొన్నాళ్లు ఆగుదామ‌నే భావ‌న‌కు వ‌చ్చార‌ట‌. బీజేపీలోకి చేరిన టీడీపీ నేత‌లు కూడా జ‌గ‌న్‌తో మంత‌నాలు జ‌రుపుతున్న‌ట్లు పుకార్లు మొద‌ల‌య్యాయి. ఇదంతా నిజ‌మేనా.. అంటే.. రాయ‌ల‌సీమలో ఒకప్పుడు జ‌గ‌న్ పేరెత్తితే బూతు పురాణం అందుకున్న జేసీ సోద‌రులు కూడా ఇప్పుడు జ‌గ‌న్ కు ద‌గ్గ‌ర‌య్యేందుకు మార్గాలు అన్వేషిస్తున్నార‌ట‌. ఆదినారాయ‌ణ‌రెడ్డి బ్ర‌ద‌ర్స్ కూడా క‌డ‌ప ప‌ర్య‌ట‌న‌కు రాబోతున్న జ‌గ‌న్‌ను క‌ల‌సి వైసీపీ కండువా క‌ప్పుకుంటార‌ట‌. మ‌రి వైసీపీ సీనియ‌ర్ల‌తో మంత‌నాలు జ‌రిపిన తెలుగు త‌మ్ముళ్లు.. ఎప్పుడు కండువా మార్చుకుంటార‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారింద‌న్న‌మాట‌.

You might also like

Leave A Reply

Your email address will not be published.