FbTelugu

వారిపైనా వేటు వేస్తారా?

ఏపీ రాజకీయాల్లో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం వేడిని రాజేసింది. వైసీపీ నుంచి ఎంపీగా విజయం సాధించిన ఆయన ఇప్పుడు ఆ పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా, ముఖ్యంగా విజయసాయిరెడ్డిని టార్గెట్‌ చేస్తూ మాట్లాడారు. దీనిపై వైసీపీ అధిష్టానం కూడా గుర్రుగా ఉంది. చర్చోపచర్చల తర్వాత ఆయనకు షోకాజ్‌ నోటీసు జారీచేసింది. దానికి ఆ ఎంపీ సరైన సమాధానం ఇవ్వలేదు. పైగా విజయసాయిరెడ్డి టార్గెట్‌గా ప్రశ్నలను సంధించారు. దీంతో ఆ పార్టీ ఎంపీలు అంతా కట్టకట్టుకొని ఢిల్లీ వెళ్లి.. అది కూడా ప్రత్యేక విమానంలో పోయి రఘురామ కృష్ణంరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, అతడిని వెంటనే ఎంపీ పదవినుంచి తొలగించాలని లోక్‌సభ స్పీకర్‌కు వినతిపత్రం సమర్పించారు. స్పీకర్‌ కూడా తమకు భరోసా ఇచ్చారని ఆ ఎంపీలు బయటకు వచ్చిన తర్వాత చెప్పుకున్నారు.

ఇంతవరకు బాగానే ఉంది కానీ, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారన్న కారణంతో ఆ ఎంపీని పదవినుంచి తొలగించాలని కోరిన వైసీపీ ఏపీలో కూడా అదే పద్ధతికి కట్టుబడి ఉంటుందా అన్న ప్రశ్న ఏపీవాసుల్లో, రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఎందుకంటే కొన్నాళ్ల నుంచి టీడీపీకి చెందిన అనేకమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టీడీపీ, చంద్రబాబు, లోకేష్‌లపై తీవ్రంగా విమర్శలకు దిగారు. ఇప్పుడు వారంతా జగన్‌ జట్టులోనే కొనసాగుతున్నారు. మరి వారిపై టీడీపీ ఫిర్యాదు చేస్తే అసెంబ్లీ స్పీకర్‌ కూడా ఆ ఎమ్మెల్యేలపై వేటు వేస్తారా..? ఆ ఎమ్మెల్యేలను పదవినుంచి తొలగిస్తారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి జగన్‌ సీఎం అయిన తర్వాత చేసిన వ్యాఖ్యలను టీడీపీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. తమ పార్టీలోకి ఎవరు వచ్చినా ముందు వారి పదవులకు రాజీనామా చేసిన తర్వాతే తమ పార్టీలో చేర్చుకుంటామని చెప్పారు. కానీ, ఆ వ్యాఖ్యలకు జగన్‌ తిలోదకాలిచ్చారు. టీడీపీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి పదవులకు రాజీనామా చేయకుండానే వైసీపీ గూటికి చేరారు. వారిని తమ పదవులకు రాజీనామా చేయాలని జగన్‌ కూడా కోరలేదు. ఇలా జగన్‌ తన నిర్ణయాలను మార్చుకుంటూ పోతున్నారని.. అలాంటి సమయంలో ఇప్పుడు ఎంపీ రఘురామ కృష్ణంరాజును పదవి నుంచి తొలగించాలని లోక్‌సభ స్పీకర్‌ను కోరడం ఏం పద్ధతి అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ రఘురామ కృష్ణంరాజుపై లోక్‌సభ స్పీకర్‌ వేటువేస్తే.. ఏపీలో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కూడా పదవినుంచి తొలగిస్తారా అని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.