FbTelugu

 ఆ జిల్లాకు మా వాడి పేరే పెట్టాలి!

అపుడెపుడో.. సారీ ఇపుడు కూడా.. స‌ర్కారు బ‌డుల‌కు ఫ‌లానా వ్య‌క్తి పేరు పెట్టాల‌నుకుంటే చాలు. డ‌బ్బులిచ్చి అభివృద్ధికి తోడ్పాటును అందిస్తే స‌ద‌రు గొప్ప వ్య‌క్తుల పేర్లు బ‌డుల‌కు పెట్టేసేవారు. ఏపీలో ఈ హ‌వా చాలా బాగా న‌డిచింది. ఆయ‌న ఏం చ‌దువుకున్నాడు. అస‌లు స‌మాజంలో ఆయ‌న‌గారికి ఉన్న గౌర‌వం ఏమిటీ అనేది చూడ‌కుండా బ‌డి గేటు బ‌య‌ట‌.. ఇది.. ఫ‌లానా వారి పాఠ‌శాల అంటూ త‌గిలించేవారు. అలా… వంద‌లు.. వేల సంఖ్య‌లో ఇప్ప‌టికీ పోలీసు రికార్డుల్లో రౌడీషీట‌ర్లు. హంత‌కులుగా ముద్ర‌ప‌డిన వారి పేర్ల‌నూ చేర్చారు. ఇప్పుడు అది ఏకంగా ఒక జిల్లాకు పేరు పెట్టాల‌నేంత‌గా పాకింది. అదేదో.. స్వాతంత్ర స‌మ‌ర‌యోధులు… దేశాన్ని క‌నీసం సొంతూరును ఉద్ద‌రించిన మ‌హానుభావులైతే బాగానే ఉంటుంది. కానీ.. ఏవో కొన్ని ఘ‌న‌కార్యాలు చేసిన‌ట్టుగా చూపుకుంటూ మా నాయ‌కుడు పేరు ఫ‌లానా జిల్లాకు పెట్టాల‌ని స‌ద‌రు సామాజిక‌వ‌ర్గ నేత‌లు ఏకంగా చ‌ట్ట‌స‌భ‌ల‌కు విన్న‌వించ‌టం బాధాక‌రం.

ఏపీలో ఇప్పుడు పేర్ల గోల మొద‌లైంది. కృష్ణాజిల్లాకు నంద‌మూరి తార‌క రామారావు పెడ‌తానంటూ జ‌గ‌న్ హామీనిచ్చారు. కానీ.. కాపులు మాత్రం త‌మ వ‌ర్గ నాయ‌కుడు వంగ‌వీటి మోహ‌న‌రంగా పేరు ఖ‌రారు చేయ‌మంటున్నారు. జ‌గ‌న్ ఎలాగూ.. జిల్లాల సంఖ్య‌ను పెంచాల‌నుకుంటున్నారు. ఒక్కో పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఒక్కో జిల్లా చేయాల‌నే త‌లంపులో ఉన్నారు. దీంతో ఏదోఒక పార్లమెంట‌రీ స్థానానికి త‌మ వారి పేర్లు ఉండాల‌నేది నేత‌ల గొడ‌వ‌. ఇలా చేయ‌టం వ‌ల్ల త‌మ పేరు ప్ర‌ఖ్యాతులు రేప‌టి రోజున ఈవీఎంల నిండా ఓట్లు ప‌డ‌తాయ‌నేది వారి ఆశ‌. దానిలో త‌ప్పేమీ లేదు. గాక‌పోతే ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయా జిల్లాల‌కు ఉన్న ఉనికి.. వాటి పేర్ల వెనుక దాగిన చారిత్ర‌క నేప‌థ్యం అన్నీ కాల‌గ‌ర్భంలో క‌ల‌సిపోతాయ‌నేది మేధావుల ఆందోళ‌న‌. గోదావ‌రి జిల్లాల పేరు మార్పును ఉభ‌య గోదావ‌రి జిల్లా ప్ర‌జ‌లుఅస్స‌లు ఇష్ట‌ప‌డ‌ట్లేదు. కానీ మొన్న ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు మాత్రం గోదావ‌రి జిల్లాల్లో ఒక‌దానికి అల్లూరి పేరు కావాలంటున్నారు. ఇటు ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీల్లోనూ కొన్ని పేర్లు మార్చాల్సి ఉంది. ఇలా.. తెలుగుగ‌డ్డ‌కు గుర్తింపు తెచ్చిన మ‌హ‌నీయుల నామ‌ధేయాలు సూచించినా మున్ముందు రాజ‌కీయంగా ఎలాంటి ప్ర‌భావం చూపుతాయ‌నే ఆందోళ‌న కూడా పార్టీల్లో లేక‌పోలేదు. ఎందుకంటే కొంద‌రికి అద్భుతం అనిపించింది.. మ‌రికొంద‌రికి న‌చ్చ‌క‌పోనూ వ‌చ్చ‌నేది అస‌లు సంగ‌తి.

You might also like