FbTelugu

కులాలందు… రాజ‌కీయ కులం వేర‌యా!

ఎంతైనా కులం.. కుల‌మే. మ‌తం.. మ‌త‌మే. లేక‌పోతే… 2014లో చంద్ర‌బాబు కోసం క‌మ్మ‌వ‌ర్గం అంతా ఏక‌మై ఎందుకు గెలిపిస్తారు. 2019లో రెడ్లంతా ఒక‌టై మ‌రీ జ‌గ‌న్ కోసం ఎందుకంత శ్ర‌మిస్తారు. 2009, 2019లో కాపు కులం అంతా ఎందుకు ఒకేతాటిపైకి రాలేక‌పోయారు. అపుడు చిరంజీవి.. ఇపుడు ప‌వ‌న్‌ను ఘోరంగా ఎందుకిలా అవ‌మానించార‌నేది కూడా కుల పంచాయ‌తీలో మ‌రో చెప్పుకోద‌గిన అంశమే. కొద్దిసేపు ఇవ‌న్నీ ప‌క్క‌న‌బెడితే… ఏపీలోని ఉత్త‌రాంధ్ర‌, కోస్తా, కోన‌సీమ‌, రాయ‌ల‌సీమ ప్రాంతాల్లో ఒక్కోచోట ఒక్కో కులం బ‌లంగా ఉంటుంది. గ‌తంలో అక్క‌డ ఈ కుమ్ములాట‌లు లేన‌పుడు.. కులాల‌కు అతీతంగా నాయ‌కులు పుట్టుకు వ‌చ్చేవారు. ఇప్పుడా ప‌రిస్థితి లేదు.

ఫ‌లానా ఏరియాలో ఫలానా కులం బ‌ల‌మంటే.. అక్క‌డ డ‌బ్బున్న కులం నుంచి ఒక నాయ‌కుడు రాత్రికి రాత్రే పుట్టుకొస్తాడు. 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ ఇదే విధ‌మైన రాజ‌కీయ చాతుర్యం ఉప‌యోగించి టీడీపీలోని క‌మ్మ‌, కాపు, రెడ్డి, రాజు, బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయ‌కుల‌కు ధీటుగా అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టింది. ఇదంతా పీకే అదేనండీ.. ప్ర‌శాంత్‌కిషోర్ వ్యూహమే అంటారు. ఎన్నిక‌ల ప్లానింగ్ స‌క్సెస్ అయినా.. ఇప్పుడు కుల పంచాయితీల‌తో ఏపీ రాజ‌కీయాలు మారుమోగుతున్నాయి. కాపు, మైనార్టీ, ఎస్సీ మూడు కులాల‌కు డిప్యూటీ సీఎంలు. రెండున్న‌రేళ్ల చొప్పున మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌తో అంద‌రికీ బుజ్జ‌గింపు. ఇటువంటి స‌మ‌యంలో ఉత్త‌రాంధ్ర‌, విశాఖ తీరంలో రాజు, బీసీ వ‌ర్గ మంట‌లు.

ఇటు వైసీపీతోపాటు అటు టీడీపీ ను వ‌ణ‌కు పుట్టిస్తున్నాయి. సింహాచ‌లం ఆల‌య ఛైర్‌ప‌ర్స‌న్‌గా సంచ‌యిత‌కు ప‌గ్గాలిచ్చి అశోక్‌గ‌జ‌ప‌తిరాజుకు షాక్ ఇచ్చాడు జ‌గ‌న్‌. వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు వ‌ర్సెస్ ప్ర‌సాద‌రాజుల గొడ‌వ‌తో జ‌గ‌న్ కు ఝ‌ల‌క్ ఇచ్చాడు ర‌ఘురాముడు. అచ్చెన్న అరెస్ట్‌ను బీసీ వ‌ర్గానికి ఆపాదించాల‌ని చూస్తున్నాడు చంద్ర‌బాబు. చిరంజీవితో సాన్నిహిత్యం పెంచుకుంటూ… కాపుల‌కు ద‌గ్గ‌ర కావాల‌నేది వైసీపీ మ‌రో ఎత్తుగ‌డ‌. సీఏఏకు వ్య‌తిరేకంగా మ‌ద్ద‌తునిచ్చిన వైసీపీ స‌ర్కార్ మైనార్టీల‌ను ద‌గ్గ‌ర చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తుంది. ఇలా.. వైసీపీ అన్ని కులాల‌ను ద‌గ్గ‌ర చేసుకునే క్ర‌మంలో ఓ అడుగు ముందుంది.

టీడీపీ మాత్రం 2014-19 వ‌ర‌కూ సాగించిన క‌మ్మ పెత్త‌నం తాలూకూ వ్య‌తిరేక‌త నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు నానాతంటాలు ప‌డుతుంది. 2019 ఎన్నిక‌ల్లో ఓట‌మికి కేవ‌లం వైసీపీ బ‌ల‌మే గాకుండా.. టీడీపీ కేవ‌లం క‌మ్మ వ‌ర్గానికే ప‌రిమిత‌మ‌నే ప్ర‌చారం.. దానికి త‌గిన‌ట్టుగా ఐదేళ్ల‌పాటు నేత‌లు సాగించిన అవినీతి, అక్ర‌మాలు కూడా జ‌గ‌న్‌ను లాభించాయి. ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ఇవ‌న్నీ కులం తాలూకూ గెలుపోట‌ములే. దీన్నుంచి బ‌య‌ట‌ప‌డి.. 2024 నాటికి.. కులాల‌న్నీ మాకు స‌మాన‌మే గాక‌పోతే.. మా కులం కాస్త ఎక్కువ స‌మాన‌మంటూ ఎవ్వ‌రూ జ‌నానికి ద‌గ్గ‌ర‌వుతారో ఏపీ కుల ఓట‌ర్లు నిర్ణ‌యించాలి.

You might also like