FbTelugu

బాబుకు నోటీసు ఇస్తారా? లేదా?

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడుకు వైసిపి ప్రభుత్వం నోటీసులు ఇప్పిస్తుందా లేదా వెనక్కి తగ్గుతుందా అనేది సస్సెన్స్ గా మారింది. గత రెండు రోజులుగా మీడియాలో ఊదరగొట్టిన వైసిపి పెద్దలు, ఉన్నట్టుండి ఆదివారం నుంచి మౌనం దాల్చారు.
చంద్రబాబు నాయుడుకు నోటీసులు ఇవ్వడంపై ఏపి పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు. ఏపి డిజిపి ఆదేశాల కోసం పోలీసులు ఆదివారం ఉదయం నుంచి హైదరాబాద్ నగరంలో పడిగాపులు కాస్తున్నారు. కర్నూలులో ఎన్.440కె కరోనా వైరస్ ప్రవేశించిందని, ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందిందని చంద్రబాబు నాయుడు గతవారం విమర్శించారు. ఈ విమర్శలు రాష్ట్రం పరువు తీసే విధంగా ఉన్నాయని కర్నూలు లో వకీలు సుబ్బయ్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ముందూ వెనకా ఆలోచించకుండా కేసులు నమోదు చేసిన పోలీసులు ఆదివారం హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడుకు నోటీసులు ఇచ్చేందుకు వచ్చారు.

అవసరమైతే విచారణ అధికారి చంద్రబాబు ను అరెస్టు చేస్తారని కర్నూలు జిల్లా ఎస్పీ ఫకీరప్ప కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఏపి మత్స్య శాఖ మంత్రి సిదిరి అప్పలరాజు ఎన్.440కె వైరస్ పై కూడా ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఎన్.440కె వైరస్ ప్రవేశించిందంటూ ప్రకటన చేశారని, ఆయనపై కేసు నమోదు చేయాలంటూ కర్నూలు జిల్లా పోలీసులకు టిడిపి నాయకులు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదుపై ఇంత వరకు చర్యలు తీసుకోలేదు. మంత్రిపై అందిన ఫిర్యాదును పక్కనబెట్టి, చంద్రబాబు కు నోటీసులు ఇస్తే చట్టపరంగా చిక్కులు ఎదురవుతాయని భావించిన పోలీసులు పునరాలోచనలో పడ్డట్టు వార్తలొస్తున్నాయి. వైసిపి నాయకులు కూడా నోటీసులపై మాట్లాడ్డం లేదు.

You might also like

Leave A Reply

Your email address will not be published.