FbTelugu

ఈ ఫలితాలకు అర్ధమేంటో..?

ఎన్నో వివాదాలు.. ఆటుపోట్లు.. కోర్టు కేసులు.. పంతాలు.. పట్టింపులను దాటుకొని ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి విడత ఎన్నికలు పూర్తయ్యాయి. రెండో విడత శనివారం (ఈ నెల 13) జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అత్యధిక సర్పంచ్, వార్డు స్థానాలను అధికార వైసీపీ కైవసం చేసుకొంది.

దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ తమకే ఎక్కువ స్థానాలు వచ్చినట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే, ఏపీలో జరిగిన ఎన్నికలు ఒక ఎత్తయితే.. రాజధాని అమరావతి ప్రాంతంలో జరిగిన ఎన్నికలు ఒక ఎత్తు. అమరావతి ఒక్కటే కాదు.. ఏపీకి మూడు రాజధానులు ఉండాలని జగన్‌ నేతృత్వంలోని ఏపీ సర్కారు నిర్ణయించింది. అయితే, దీనిపై ఒక్కసారిగా విభేధాలు భగ్గుమన్నాయి. తాము తమ విలువైన భూములను రాజధాని కోసం ఇచ్చామని, ఇప్పుడు మూడు రాజధానులంటే తామంతా రోడ్డున పడతామని అమరావతి ప్రాంత రైతులు రోడ్డెక్కారు. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. విపక్షాలు కూడా వీరికి మద్దతుగా నిలిచాయి. సుమారు 400 రోజులుగా అక్కడి గ్రామాల ప్రజలు నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. దీంతో అమరావతి ప్రాంతంలో అధికార వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్న భావన అందరిలోనూ ఉంది. కొందరు అధికార పార్టీ నేతలు కూడా ఇదే భావనలో ఉన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ మొదటి విడతలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను వైసీపీ మద్దతుదారులే గెలుచుకున్నారు. దీంతో విపక్షాలతో పాటు ఒకింత అధికార పార్టీ నేతలు కూడా అవాక్కయ్యారు. మూడు రాజధానులపై నిత్యం ఆందోళన చేస్తున్న రైతులు, స్థానికులు తమను రోడ్డుపాలు చేసిన వైసీపీ మద్దతుదారులకు ఎలా ఓట్లు వేశారని ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ ఫలితాల సారంశమేంటి..? ఇవి ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయన్న దానిపై జోరుగా చర్చ సాగుతోంది. ఈ ఫలితాల తర్వాత వైసీపీ మాత్రం తన స్వరాన్ని పెంచింది. తాము మొదటి నుంచీ చెప్పినట్టుగానే ఆందోళన చేస్తున్న వారు రైతులు కాదని.. అక్కడి ప్రజలు కూడా మూడు రాజధానులకు అంగీకరించారని.. అందుకే వారంతా వైసీపీకి ఓట్లు వేశారని చెబుతున్నారు. మూడు రాజధానుల ఏర్పాటుపై అమరావతి ప్రాంత ప్రజలు కూడా అంగీకారం తెలిపినట్టేనని చెబుతున్నారు.

అయితే, విపక్షాలు మాత్రం వైసీపీ ఆగడాలు, బెదిరింపులకు తట్టుకోలేకనే వారికి ఓట్లు వేశారు తప్ప మూడు రాజధానులకు మద్దతుగా నిలవలేదని చెబుతున్నారు. మొత్తానికి ఇక్కడి ప్రజల తీర్పును ఎలా తీసుకోవాలో తెలియడం లేదని రాజకీయ పండితులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఏమైనా అమరావతి ఉద్యమం విషయంలో ఈ ఫలితాలు వైసీపీకి ఊరటనిచ్చే అంశమే అంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.