FbTelugu

జులైలో ఏపీలో స్థానిక ఎన్నిక‌లు!

వివాదాల మ‌ధ్య ఆగిపోయిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లపై జ‌గ‌న్ ప్ర‌భుత్వం దృష్టిపెట్టిందా..? ఎంత వీలైతే అంత త్వ‌రగా ముగించాల‌ని భావిస్తోంది. ప్ర‌భుత్వ వ‌ర్గాల ద్వారా అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది.

స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించే విష‌యంపై ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప‌ట్టుద‌ల‌తో ఉన్నార‌ని తెలుస్తోంది.
మార్చి చివ‌రిలో ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. పంచాయ‌తీల నుంచి మున్సిపాలిటీల వ‌ర‌కు ఎన్నిక‌లు జ‌రిగేందుకు ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ ప్ర‌క‌టించింది. నామినేష‌న్ల స్వీక‌ర‌ణ పూర్తి కావ‌డం, చాలావ‌ర‌కు వార్డులు, మండ‌లాలు వైసీపీ ఖాతాలో చేరాయి. భ‌య‌పెట్టి, బెదిరించి ప్ర‌త్యర్థుల నామినేష‌న్లు లాక్కొని చించేసి వైసీపీ ఏక‌గ్రీవంగా గెలిచింద‌ని ఆరోప‌ణ‌లు వినిపించాయి.

అందుకుత‌గ్గ‌ట్టుగా గుంటూరు జిల్లాలో మాచ‌ర్ల‌లో ఏకంగా టీడీపీ నేత‌ల‌పై పెద్ద ఎత్తున దాడులు జ‌రిగాయి. అనంత‌పురం, క‌ర్నూలు, ప్ర‌కాశంలోనూ అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య భారీ గొడ‌వలు జ‌రిగాయి. కానీ ప‌రిస్థితుల్లో ఒక్క‌సారి మార్పు. క‌రోనా వ‌చ్చి వైసీపీ అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేసింది. ఎన్నిక‌ల సంఘం సైతం ఎన్నిక‌లు ఎక్క‌డ ఉన్నాయో అక్క‌డితో నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ప్ర‌భుత్వంతో సంప్ర‌దించ‌కుండా ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ ఏకప‌క్షంగా ఎన్నిక‌లు వాయిదా వేశార‌ని జ‌గ‌న్ స్వ‌యంగా ప్రెస్‌మీట్ పెట్టి మ‌రీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

త‌ర్వాత క‌రోనా విజృంభించ‌డంతో ఎన్నిక‌లు నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డ్డాయి. ఇదే అదునుగా నిమ్మ‌గ‌డ్డ‌ను తొల‌గించి క‌న‌గ‌రాజ్‌ను నియ‌మిస్తూ ఏపీ ప్ర‌భుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. త‌న‌ను దురుద్దేశ‌పూర్వంగా ఏపీ ప్ర‌భుత్వం తొల‌గించింద‌ని చెబుతూ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ ఏపీ హైకోర్టులో పిటిష‌న్ వేశారు. దీనిపై విచార‌ణ జ‌రుగుతోంది.
ఇది ఎలా ఉన్నా, జులైలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ఏపీ ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు చేస్తోంద‌ని స‌మాచారం. కానీ పంచాయ‌తీ, మండ‌ల‌, జిల్లా ప‌రిషత్, మున్సిప‌ల్ ఎన్నిక‌లు ఒకేసారి కాకుండా ముందుగా మున్సిప‌ల్ ఎన్నిక‌లు లేదా పంచాయ‌తీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని భావిస్తోంది. జులై నాటికి క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్టినా ప‌ట్ట‌క‌పోయినా ఎన్నిక‌లను మాత్రం సోష‌ల్ డిస్టెన్స్ పాటించేలా ప్లాన్ చేస్తూ నిర్వ‌హించాల‌ని ఏపీ ప్ర‌భుత్వం ఆలోచ‌నగా క‌నిపిస్తోంది. క‌రోనాతో స‌హ‌జీవ‌నం త‌ప్ప‌ద‌ని ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.

దీన్ని దృష్టిలో ఉంచుకుని క‌రోనాతో పోరాడుతూనే ప్ర‌తిప‌క్షాల‌తో ఎన్నిక‌ల ర‌ణ‌క్షేత్రంలో పోరాడాల‌ని భావిస్తున్నారు. క‌రోనావైర‌స్ ప్ర‌భావంతో బ్యాలెట్ విధానంలో ఎన్నిక‌లు నిర్వ‌హించే విష‌యాన్ని ఎన్నిక‌ల సంఘం ప‌రిశీలిస్తోందని స‌మాచారం.

You might also like