FbTelugu

కరోనా విధుల నుంచి తప్పుకుంటాం: ఏపీ వైద్యులు

డీఎంహెచ్ఓ లపై జేసీలు వ్యక్తిగత దూషణ

అమరావతి: రాష్ట్రంలో వైద్యుల స్థాయికి తగ్గ గౌరవం ఇవ్వలేని పక్షంలో కరోనా పాజిటివ్ వార్డుల విధుల నుంచి తప్పుకొనేందుకు అనుమతివ్వాలని ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం లేఖ పంపించింది. రాష్ట్ర వైద్యాధికారులు, ఉన్నతాధికారుల వల్ల తరచూ అవమానాలు, దూషణలకు గురవుతున్నట్లు ఆ లేఖలో లేవనెత్తారు. కరోనా వార్డులలో పనిచేసే వాతావరణం లేనందున వైద్యులు అనేక రకాలుగా అవస్థలు పడుతున్నారు. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ తరచూ వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహించి ఆచరణ సాధ్యం కాని విధంగా ఆదేశాలు జారీ చేస్తున్నారు.
వారానికి రెండుసార్లు తహసీల్దారు, ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్వహించే సమావేశాలకు వైద్యులు హాజరుకావడం ఇబ్బందికరంగా ఉంది. ఇకనుంచైనా కనీసం 15 రోజులకోసారి వీడియో సమావేశాలు నిర్వహించాలి. కొత్త యాప్‌లకు తగ్గట్లు వివరాలు నమోదు చేయడం వైద్యులకు సాధ్యం కావడం లేదని ఆ లేఖలో తెలిపారు.
జిల్లా జాయింట్ కలెక్టర్లు నిర్వహించే సమీక్షా సమావేశాల్లో డీఎంహెచ్‌ఓ లను ఇబ్బంది పెడుతున్నారు. సమావేశ ప్రారంభం అయిన తరువాత కాస్త ఆలస్యంగా వచ్చారని ప్రకాశం జాయింట్‌ కలెక్టర్‌, డీఎంహెచ్ఓ ను నిల్చోబెట్టారని సంఘం ఆరోపించింది. అలాగే అనంతపురం డీఎంహెచ్‌ఒను జిల్లా కలెక్టర్, జేసీ వ్యక్తిగతంగా దూషించారు. శ్రీకాకుళం, నెల్లూరు డీఎంహెచ్‌ఓ లను సెలవుపై వెళ్లాలని జిల్లా కలెక్టర్ ఒత్తిడి పెంచారు.

కరోనా పర్యవేక్షణ బాధ్యతలను జేసీలకు అప్పగించిన అనంతరం పరిస్థితులు దుర్లభంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడ, తెనాలి, ఏలూరులో వైద్యులు మరణించినా ఇప్పటివరకు నష్టపరిహారం ప్రకటించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ వైద్యులకు హైదరాబాద్‌, బెంగుళూరు నగరాల్లో వైద్యసేవలు పొందే అవకాశాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా జేసీ, ఆర్‌ఎంపీ లతో సమావేశం జరిపారని, ఇదే పద్దతి అని ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర కన్వీనర్‌ డా. డి.జయధీర్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.