FbTelugu

సరిహద్దు చెక్‌ పోస్టులు కొనసాగుతాయి: ఏపీ

కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ ఛైర్మన్‌ కృష్ణబాబు

విజయవాడ: ఏపీ రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌ పాయింట్లను తొలగించడం లేదని ఏపీ కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ ఛైర్మన్‌ కృష్ణబాబు తెలిపారు.

రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్‌ పోస్టులను తొలగించే నిర్ణయమేదీ ప్రభుత్వం తీసుకోలేదని, తొలగించారన్న వార్తలు నిరాధారమని ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. కొవిడ్‌ ఆర్డర్‌ 55 ప్రకారం చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున సరిహద్దులు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో ప్రవేశాలను నియంత్రిస్తామని ఆయన వివరించారు.

ఎక్కువ కరోనా కేసులున్న 6 రాష్ట్రాల నుంచి వచ్చేవారు 7 రోజుల పాటు హోం  క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని కృష్ణబాబు స్పష్టం చేశారు. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలకు బస్సులు నడపడానికి ఇంకా అనుమతులు రాలేదన్నారు. తెలంగాణ నుంచి అనుమతి లభిస్తే రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.

You might also like