రంగారెడ్డి జిల్లా జన్వాడలో నిబంధనలకు విరుద్ధంగా కేసీఆర్ తనయుడు, రాష్ట్రమంత్రి కేటీఆర్ ఫాంహౌస్ నిర్మించారన్న అంశం మరో ట్విస్ట్ ఇచ్చింది. 111 జీఓ ప్రకారం ఇక్కడ నిర్మాణాలు చేపట్టకూడదని, కానీ, కేటీఆర్ ఇక్కడ అక్రమంగా ఫాంహౌస్ నిర్మాణాన్ని అన్ని హంగులతో చేపట్టారని కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
ఆరోపించడమే కాదు. అక్కడ వ్యవహారాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రించడానికి కూడా ప్రయత్నించారు. అయితే, పోలీసులు దానిని అడ్డుకొని రేవంత్‌పై కేసు కూడా నమోదు చేశారు. అయితే, తాజాగా ఈ వ్యవహారం తేల్చేందుకు ఓ కమిటీని కూడా నియమించారు. దీంతో ఈ పంచాయతీ మళ్లీ తెరమీదకు వచ్చింది. అయితే, కేటీఆర్ మాత్రం ఆ ఫాంహౌస్ తనది కాదని, దానికీ, తనకు ఏ సంబంధమూ లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ మరో ఆధారంతో ముందుకు వచ్చి సంచలనం లేపారు. రంగారెడ్డి జిల్లా జన్వాడలోని సర్వే నంబర్ 301లో రెండెకరాల భూమి కేటీఆర్ దంపతుల పేరుమీద 2017 మార్చి 7న రిజిస్టర్ అయిందని రేవంత్ ఆరోపించారు.
అయితే, ఆ భూమి తనది కాదంటున్న కేటీఆర్ 2018లో జరిగిన ఎన్నికల్లో తన అఫిడవిట్లో జన్వాడలో అర్చనా వెంచర్స్ మీద ఆస్తులు ఉన్నట్టు ఎలా చెప్పారని రేవంత్ ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఆ భూమికి తనది కాదని చెబుతున్నారని, 2018 అఫిడవిట్‌ను పరిశీలిస్తే ఆ భూమి ఆయనేదనన్న విషయం బయటపడుతుందని చెబుతున్నారు. అయితే, ఈ విషయంపై రేవంత్, కేటీఆర్ మధ్య తీవ్ర చర్చ జరుగుతోంది. దీనిపై సామాన్యుల మదిలో ఓ ప్రశ్న మెదులుతోంది. జన్వాడ భూమి తనది కాదని కేటీఆర్, ఆయన పార్టీ నాయకులు చెబుతున్నారు కదా.. అలాంటప్పుడు ఆ భూమి ఎవరిది.. అది ఎవరి పేరుతో ఉంది అనే అంశాలను ప్రభుత్వం, కేటీఆర్ వెల్లడించవచ్చు కదా అన్న అనుమానాలు వారిలో ఉదయిస్తున్నాయి. ప్రభుత్వం వారి చేతిలోనే ఉంది కాబట్టి ఆ వాస్తవాలను వెల్లడించవచ్చు. కానీ, అలా చేయకుండా కేవలం అది నా ఆస్తికాదు అని చెప్పడం వెనుక ఏమైనా అంతరార్ధం ఉందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సర్కారు ఆ భూమి ఎవరిదో తేల్చాలని తెలంగాణవాసులు కోరుతున్నారు.