FbTelugu

తెలంగాణకు మరో ప్రమాదం

తెలంగాణలో ఇప్పటికే కరోనా కాఠిన్యాన్ని చూపుతోంది. పల్లెలు, పట్టణాలు దాని ధాటికి కకావికలం అవుతున్నాయి. ఈ గండంనుంచి బయటపడడం ఎలాగో తెలియక అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే కరోనాతో పల్లెలు, పట్టణాలు శ్మశానాలుగా మారుతున్నాయి. కుటుంబాలకు కుటంబాలే మృత్యువాత పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితిని తట్టుకోవడమే కష్టంగా ఉంటే ఇప్పుడు మరో ప్రమాదం ముంచుకువస్తోంది. తెలంగాణలోకి కొత్తరోగం ఎంటరైంది. ఒకవైపు రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతుంటే.. మరోవైపు సీజనల్, వైరల్‌ జ్వరాలు విజృంభణ కొనసాగుతోంది.

ఈ రెండింటితో ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా రాష్ట్రంలో మరో కొత్తరకం వ్యాధి బయటపడింది. ఆదిలాబాద్‌ జిల్లాలో మొదటి కేసు నమోదైంది. అచ్చం పచ్చ కామెర్ల తరహాలో ఉండే ఈ వ్యాధి పేరు లెప్టోస్పీరోసీస్‌. ఈ వ్యాధికి సంబంధించి నాలుగు కేసులను గతేడాది కూడా గుర్తించినట్లు వైద్యులు చెబుతున్నారు. ఎలుకలు, పిల్లులు, కుక్కలు, పందులు, ఇతర జంతువుల మూత్రం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ వ్యాధి సోకిన వారిలో జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, చలి వంటివి కనిపిస్తాయన్నారు. సకాలంలో ఈ వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉందని.. లేదంటే కిడ్నీలు, లివర్‌పై ప్రభావం చూపుతుందని డాక్టర్లు తెలిపారు. కరోనా కాలంలో ఈ వ్యాధి కూడా విజృంభిస్తే పరిస్థితి ఏంటని జనం తలలు పట్టుకుంటున్నారు. సాధారణ జ్వరం వస్తేనే ఆసుపత్రులు రోగులను చేర్చుకోవడం లేదు. ఒకవేళ చేర్చుకున్నా లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇక, ఈ కొత్త రోగం వచ్చిన వారిని ఆసుపత్రుల్లో చేర్చుకోపోతే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని తెలంగాణవాసులు ఆందోళన చెందుతున్నారు.

You might also like