న్యూయార్క్: కరోనా వైరస్ ప్రభావం లేదని అందరూ అనుకుంటున్నారని, అది నిజం కాదని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ స్పష్టం చేశారు. మరో ఆరు నెలల పాటు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.
అమెరికాతో పాటు పలు దేశాల్లో కరోనా వైరస్ రెండోదశ మొదలైందని, కేసులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతే స్థాయిలో మరణాలు కూడా నమోదు అవుతున్నాయన్నారు. రానున్న ఆరు నెలల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆయన అన్నారు.
ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాక్యులేషన్ అంచనాల ప్రకారం అమెరికాలోనే మరో రెండు లక్షల మరణాలు నమోదు అవుతాయన్నారు.
అమెరికా పౌరులు ఇకనైనా ప్రభుత్వ సూచనలు పాటించాలని, వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని బిల్ గేట్స్ కోరారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటిస్తే ఎక్కువ శాతం మరణాలు నివారించవచ్చన్నారు. కరోనా మహమ్మారి కారణంగా అమెరికాలో ఇప్పటికే సుమారు 3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా భారీ ముప్పు తప్పదని ఆయన స్పష్టం చేశారు.
కరోనా వైరస్ పై 2015లో అంచనా వేశానని, తన అంచనాలను తల్లకిందులు చేస్తూ కేసులు నమోదు అవుతున్నాయని, మరణాలు కూడా అధికంగా ఉన్నాయని బిల్ గేట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ పరిశోధనల కోసం గేట్స్ ఫౌండేషన్ భారీగా నిధులు సమకూర్చిందన్నారు. ఈ వైరస్ మూలంగా అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నాయని బిల్ గేట్స్ అన్నారు.