FbTelugu

ఆంధ్రా టూ హైదరాబాద్‌!

ఆంధ్రావాలాలు మొత్తం హైదరాబాద్‌ను ముంచెత్తారు. ప్రధానంగా బీజేపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు భాగ్యనగరానికి పోటెత్తారు. వారంతా ఇక్కడకు ఎందుకు వచ్చారనేగా మీ డౌటు. అదేనండి.. హైదరాబాద్‌ నగరపాలక సంస్థకు ఎన్నికలు జరుగుతున్నాయి కదా.. ఆ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించేందుకు వచ్చారట.

బీజేపీ నాయకులు ఆంధ్రా నేతలు, కార్యకర్తలను ఇక్కడకు తీసుకువచ్చి వారికి వార్డుల వారీగా పనులు అప్పగించారట. ముఖ్యంగా కుల సమీకరణల కోసం వారిని ఎక్కువగా వినియోగిస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. కుల సంఘాల్లో పనిచేస్తున్న నేతలను కొందరిని ఎంపిక చేసి వారి ద్వారా ఆ కులాల వారితో మాట్లాడించడం, వారిని బీజేపీవైపు తిప్పుకునే పనికి వాడుతున్నారట. అవసరమైతే వివిధ రకాలుగా ఆ కులాల ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు కూడా ఏర్పాట్లు చేశారన్నది ఇప్పుడు హైదరాబాద్‌లో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌. మరికొందరు ఆంధ్రా నేతలకు కేవలం ప్రచార బాధ్యతలే అప్పగించారట. వీరందరికీ మించి కొందరు రాజకీయ ఎత్తుల్లో కాకలు తీరిన వారిని కూడా రప్పించి వారితో ప్రత్యర్థి పార్టీల ఎత్తుగడలు, ఆ అభ్యర్థుల మైనస్‌ పాయింట్లను పట్టుకునే పనులు అప్పగించారట. వీరి పనంతా ఆయా పార్టీల కార్యకర్తలతో కలిసి పోయి వారితో మాట్లాడి తమకు కావాల్సిన సమాచారాన్ని సేకరించి బీజేపీ నేతలకు చేరవేయడమేనట. ప్రత్యర్థి పార్టీల్లో ఎవరు అసంతృప్తిగా ఉన్నారు..

ఎవరు డబ్బులకు, ఇతర మార్గాలకు లొంగుతారనే విషయాన్ని ఆంధ్రా బీజేపీ నేతలు రాష్ట్ర నాయకత్వానికి తెలియజేస్తారట. ఈ సమాచారంతో రంగంలోకి దిగిన కమలనాథులు వారి ఆపరేషన్‌ మొదలు పెడుతున్నారట. ఈ పద్ధతుల ద్వారానే కొందరిని తమ పార్టీలో చేర్చుకుంటుంటే.. మరి కొందరిని వారి పార్టీలోనే ఉంచి కోవర్టులుగా వాడుకున్నారట. మరికొందరు లోలోపల తమకు సపోర్టు చేసేలా మాట్లాడుకుంటున్నారని బీజేపీ కార్యకర్తలే చెప్పుకుంటున్నారు. ఇంత పకడ్బందీగా ఎన్నికల వ్యూహాన్ని అమలు చేయాలంటే కొత్తవారైతే మంచి ఫలితాలు వస్తాయని భావించిన పార్టీ అధిష్టానం ఈ ఆపరేషన్‌ జీహెచ్‌ఎంసీకి ఆంధ్రా నేతలను భారీగా తరలించారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఇంత పకడ్బందీగా చేసిన ప్లాన్‌ ఏ మేరకు సక్సెస్‌ అవుతుందో తేలాలి మరి.

You might also like

Leave A Reply

Your email address will not be published.