FbTelugu

తెలుగు త‌మ్ముళ్ల‌కు కావాల్సినంత మేత‌!

నేను లేస్తే మ‌నిసిని కాదంటాడు! అస్సలు మేము ఇప్పుడు అధికారంలో ఉంటేనా! అధికా రంలో ఉన్న‌పుడు క‌న్నుమిన్ను కాన‌కుండా ఉన్నారు.

మ‌రికొంద‌రు త‌రాల‌కు స‌రిప‌డినంత కూడ‌బెట్టారు. ఇంకొన్ని పెద్ద త‌ల‌లైతే దీక్ష‌ల‌తో కాలం వెళ్ల‌దీసి.. ట‌న్నుల కొద్దీ సానుభూతి పొందాల‌ని బొక్క‌బోర్లా ప‌డ్డారు. ఇలా తెలుగు త‌మ్ముళ్లు పోయిన ఐదేళ్ల‌పాటు చేసిన విన్యాసాలు.. చూపిన విచిత్రాలు అబ్బో అనుకోవాల్సిందే.

దేవినేని ఉమా అనే మంత్రి అయితే.. జ‌గ‌న్ రాసుకో.. 2018 నాటికి పోల‌వ‌రం క‌ట్టేస్తాం. నీళ్లు పారిస్తాం. గోదావ‌రి, కృష్ణ, పెన్నా నదుల‌న్నింటినీ క‌లిపేసి నీటి కొర‌త లేకుండా చేస్తామంటూ జ‌ల‌హార‌తితో చేసిన హ‌డావుడి బాబోయ్ బాబోరి రాజ‌కీయం అనిపించారు. న‌రేంద్ర ‌మోదీకే స‌వాల్ విసిరారు. ఏపీకు హోదా ఇవ్వ‌లేద‌నే అక్క‌సుతో బెజ‌వాడ‌లో స‌భ‌పెట్టి మ‌రీ వ‌చ్చీరాని హిందీలో బాల‌య్య‌ బాబు తొడ‌కొట్టి మ‌రీ నానాతిట్లు తిట్టాడు. 2019కూడా మాదే అన్నారు.

జ‌గ‌న్ అంటే ఏపీ జ‌నానికి విర‌క్తి అన్నారు. విజ‌న్ ఉన్న నాయ‌క‌న్ మా చంద్ర‌బాబు అంటూ ఎన్ని వంక‌లు పోయార‌నేది ఏపీ ప్ర‌జ‌ల‌కు ఇప్ప‌టికీ చెవుల్లో గింగిరాలు కొడుతున్నాయ‌ట‌. అంత‌టి రాజ‌కీయం న‌డిపిన తెలుగు త‌మ్ముళ్ల‌కు.. ఏడాది వ్య‌వ‌ధిలో తారుమారైన వాతావ‌ర‌ణాన్ని చ‌విచూస్తున్నారు. వైసీపీ ప్ర‌భుత్వం చేస్తున్న త‌ప్పిదాల‌పై నిల‌దీసే అవ‌కాశాల‌ను చేతులారా వ‌దిలేసుకుంటున్నారు. టీడీపీ ప్ర‌భుత్వంలో ప్ర‌తి చిన్న విష‌యాన్ని రాద్దాంతం చేస్తూ జ‌గ‌న్ ఎంత‌గా చీల్చి చెండాడాడ‌నే విష‌యాన్ని మ‌ర‌చిపోతున్నారు.

చింత‌మనేని, య‌ర‌ప‌తినేని ఇద్ద‌రూ ప‌దేళ్ల‌పాటు సాగించిన అరాచ‌కాల‌పై వైసీపీ చేసిన దాడితో మిగిలిన నేత‌లంద‌రూ సైలెంట్ అయ్యారు. ఫైర్‌బ్రాండ్స్‌గా ముద్ర‌ప‌డిన నాయ‌క‌గ‌ణం కూడా ట్వీట్ల‌తో స‌రిపెడుతున్నారు. విశాఖ ఎల్జీ పాలిమ‌ర్స్ విష‌వాయువు ఘ‌ట‌న‌లో టీడీపీ ఏదో చేద్దామ‌నుకుంది.. కానీ.. స‌ద‌రు సంస్థ‌కు అనుమ‌తినిచ్చింద‌ని తెలిసి సైలెంట్ అయ్యారు. న‌ర్సీప‌ట్నంలో మ‌త్తు డాక్ట‌ర్ సుధాక‌ర్ చేసిన హంగామాలో వైసీపీ పాపం ఉంద‌ని జ‌గ‌న్‌ను బ‌ద్నాం  చేద్దామ‌ని చూసినా పాపం ఎందుకో ఎత్తుగ‌డ ఫ‌లించ‌లేదు. పైగా పార్టీకే ఎదురు దెబ్బ‌తగిలినంత ప‌నైంది.

ఇప్పుడు పోతిరెడ్డిపాడు ఎత్తు పెంచుతున్నా.. నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టుగా ఉండిపోయారు. బెజ‌వాడ దుర్గ‌మ్మ స‌న్నిధిలో మంత్రి పార్టీ స‌మావేశం ఏర్పాటు చేయ‌టంపై కూడా ఎంపీ కేశినేని నాని కేవ‌లం ట్వీట్ల‌తో సరిపెట్టారు. ఇలా.. ప్ర‌భుత్వం త‌న‌దైన శైలిలో ప్ర‌జావ్య‌తిరేక‌త కార్య‌క‌లాపాలు సాగిస్తున్నా.. తెలుగు త‌మ్ముళ్లు ఎందుకో దాన్ని సొమ్ము చేసుకోలేక ఢీలాప‌డుతున్నారు. అధికార పార్టీ బెత్తం విదిల్చి చింత‌మ‌నేని, య‌ర‌ప‌తినేని జాబితాలో త‌మ‌నూ చేర్చుతుంద‌నే భ‌యం కాబోలంటూ… ఏపీ జ‌నం నుంచి విమ‌ర్శ‌లు చ‌విచూస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.