FbTelugu

గాడిన పడుతుందా..?

ఏపీలో టీడీపీ పరిస్థితి నానాటికి తీసికట్లు.. నాగం బొట్లు అన్నట్టుగా తయారైంది. ఆ పార్టీ పరాజయం తర్వాత పార్టీ నేతలు ఒక్కొక్కరుగా సైకిల్‌ దిగి ఫ్యాన్‌ పార్టీలో చేరారు. చాలామందికి పార్టీకి అంటీముట్టనట్టుగా ఉన్నారు.

అయినా, చంద్రబాబు నాయుడు మాత్రం పార్టీని తిరిగి బలోపేతం చేసే పనిలోనే ఉన్నారు. కానీ, పార్టీ బలం పుంజుకునే పరిస్థితులు కలిసి రాలేదు. అనేక అంశాలపై అధికార పార్టీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేసినా పెద్దగా టీడీపీకి ఊరటనివ్వలేదు. ఈ నేపథ్యంలోనే జగన్‌ సర్కారు రాజధాని మార్పు గురించి ప్రకటన చేసింది. దీంతో అప్పటి వరకు టీడీపీ ఏర్పాటు చేసిన రాజధాని అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల వారు భగ్గుమన్నారు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటించి అక్కడ ప్రభుత్వ భవనాలు నిర్మించినా అక్కడి ప్రజలు మాత్రం ఎన్నికల్లో టీడీపీని ఓడించారు. అంటే అక్కడి ప్రజలంతా వైసీపీకి మద్దతుగా నిలిచారు.

అలాంటి జనం ఇప్పుడు వైసీపీ నిర్ణయంపై ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు. ఈ పరిణామం తెలుగుదేశం పార్టీకి ఎంతో ఊపునిచ్చింది. అక్కడ పెద్ద ఎత్తున ఆందోళనలు జరగడం, దానికి చంద్రబాబు మద్దతుగా నిలవడంతో అమరావతి ప్రాంతంలోనే కాక, ఏపీ వ్యాప్తంగా వైసీపీని ఎండగట్టడానికి టీడీపీకి ఒక మంచి ఆయుధం దొరికింది. ఈ ఉద్యమం రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో టీడీపీ ఆశలపై కరోనా నీళ్లు చల్లింది. ప్రపంచంతో పాటు ఏపీలో కూడా కరోనా కేసులు బయటపడుతుండడంతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. దీంతో ఆందోళనకారుల ఆందోళనకు బ్రేక్‌ పడింది.

అంతకుముందు అందరినోళ్లలో నానిన రాజధాని చర్చకు కూడా బ్రేక్‌ పడింది. దీనికి తోడు లాక్‌డౌన్‌తో చంద్రబాబు హైదరాబాద్‌లో చిక్కుకుపోయారు. ఇప్పుడు ఏపీలో ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు లేవు. దీంతో విపక్షంలో ఉన్న టీడీపీకి ఇది పెద్ద దెబ్బగా మారింది. నిరంతరం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపే పనులు నిలిచిపోయాయి. పరిస్థితి ఇలాగే ఉంటే మరింత నష్టపోవాల్సి వస్తుందని భావించిన చంద్రబాబు మే 27,28 తేదీల్లో మహానాడును నిర్వహించాలని తీర్మానించారు. వాస్తవానికి అందరూ ఒక దగ్గర చేరకున్నా సాంకేతికతను ఉపయోగించుకుంటూ ఈ మహానాడు నిర్వహిస్తున్నారు. దీనిద్వారా కార్యకర్తలను కలిసే వీలుంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే, ఇది ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి. మహానాడు వల్ల కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేస్తారా.. లేక చెప్పింది విని వదిలేస్తారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

మహానాడు జరిపే సమయంలోనే టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు గోడ దూకడానికి ప్రయత్నిస్తున్నారని వస్తున్న వార్తలు ఎంతవరకు నిజమో తేలాల్సి ఉంది. మొత్తానికి మహానాడు కార్యకర్తలను ఉత్తేజితులను చేస్తుందో.. లేదో తేలాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.

You might also like