FbTelugu

సీఎం, హోం మంత్రి, డీజీపీ క్రైస్తవులే: ఏపీ టీడీపీ ఆరోపణ

అమరావతి: సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి, హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్ లు ముగ్గురూ క్రైస్తవులైనప్పుడు హిందూమతంపై ప్రభుత్వం మరింత జాగ్రత్తగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ టీడీపీ హెచ్చరించింది.

దేవాలయాల పై దాడులు జరుగుతున్నా వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోవడం లేదని ఆరోపించింది. ఇవాళ టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో దేవాలయాలపై దాడులు అంశమే ప్రధాన అజెండాగా జరిగిన పొలిట్‌బ్యూరో జరిగింది. సమావేశం ముగిసిన తరువాత టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ప్రతిపక్ష పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడుపై చేసిన పరుష వ్యాఖ్యలను సీఎం జగన్ రెడ్డి ఎందుకు ఖండించలేదు? అని ఆయన నిలదీశారు. దేవుదికే రక్షణ లేని అనాగరిక సామ్రాజ్య స్థాపనే జగన్ లక్ష్యమని, ఆ దిశాగా ప్రయత్నాలు జరుగుతున్నాయని శ్రీనివాసులు వివరించారు.
రాష్ట్రంలో మెజార్టీ ప్రజల మనోభావాలను సీఎం దారుణంగా దెబ్బతీస్తున్నారని ఆయన అన్నారు. ఏ వర్గం మనోభావాలు దెబ్బతింటే ఆ వర్గం పక్షాన కచ్చితంగా నిలబడతామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పైశాచికత్వం రాముడి శిరచ్చేదనం దాకా వెళ్లిందన్నారు. రాముడి శిరస్సు ఖండించడం వెనుక ఎవరున్నారో తేలాల్సిందేనని అన్నారు. బ్రిటిష్ కాలంలోనూ ఈ స్థాయిలో ఆలయాలపై దాడులు, దూషణ పర్వం జరగలేదని శ్రీనివాసులు అన్నారు.

హిందూ ధర్మంపై దాడి చేసే అధికారం జగన్ కు ఎవరిచ్చారు? అని ప్రశ్నించారు. హిందూ ధర్మంపై ప్రభుత్వమే దాడులు జరిపితే ఆ బాధను ఎవరికి చెప్పాలి?. విజయనగరం జిల్లా రామతీర్థం దేవాలయం సందర్శించేందుకు ప్రతిపక్ష నాయకుడు ఎన్.చంద్రబాబు నాయుడు పర్మిషన్ తీసుకుని వెళ్తే.. వైసీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి అదే రోజు ముందుగా ఎందుకు వెళ్లారని నిలదీశారు. తన కారు అద్దాలను పగులగొట్టిన తరువాత విజయసాయి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రామతీర్థం నుంచి విశాఖ వెళ్లారన్నారు. ఏపీలో దేవాలయాలపై దాడుల విషయంలో సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీబీఐ విచారణకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆదేశించాలని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.