FbTelugu

ఆనందయ్య కంటి మందు పరీక్షించాలి: జగన్ ఆదేశం

తాడేపల్లి: ఆక్సిజన్ స్థాయిలు పూర్తిగా పడిపోయిన కరోనా బాధితులకు కృష్ణపట్నం ఆనందయ్య కంటిలో వేసే చుక్కల మందు పై కంటి వైద్య నిపుణులతో పరిశీలన చేయించాలని సిఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

కంటి వైద్యుల నుంచి ఫలితాలు వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుందామని అధికారులకు సిఎం జగన్ స్పష్టం చేశారు. కోవిడ్‌–19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై క్యాంప్‌ కార్యాలయంలో సిఎం జగన్ మోహన్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా  కృష్ణపట్నం ఆయుర్వేద ఔషధంపై చర్చ జరిగింది. ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందుపై  రాష్ట్ర ఆయుష్‌ కమిషనర్ కర్నల్ రాములు వివరాలు అందించారు. కృష్ణపట్నంలో ఆనందయ్య 30–35 సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యం చేస్తున్నారు. కరోనా రోగులకు నోటి ద్వారా నాలుగు రకాల మందులు, కళ్లలో డ్రాప్స్‌ ఇలా ఐదు రకాలుగా మందులు ఇస్తున్నారు. ఈ మందు తయారీ కోసం ఆయన 18 రకాల ముడి పదార్థాలను వినియోగిస్తున్నారు. పసుపు, జీలకర్ర, జాజికాయ, కర్పూరం, మిరియాలు, తేనె ఇలా 18 రకాల పదార్థాలను ఆనందయ్య 5 రకాల మందుల్లో వాడుతున్నారని రాములు వివరించారు.

అన్నీ కూడా సహజంగా దొరికే పదార్థాలు అన్నారు. వేరే ఏ ఇతర పదార్థాలను ఆయన వాడడం లేదు. మందుల తయారీ విధానాన్ని మొత్తం మాకు స్వయంగా చూపించారు. ఎలా తయారు చేసేది కూడా ఫార్ములా చెప్పారు. అక్కడ తయారు చేసిన మందుల శాంపిళ్లను పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపించాం. కొన్ని రకాల పరీక్షల ఫలితాలు వచ్చాయి, ఇంకా కొన్ని పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందన్నారు. ఇంకా ఈ మందు శాంపిళ్లను ‘సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ ఆయుర్వేదిక్‌ స్టడీస్‌’ (సీసీఆర్‌ఏఎస్‌)కు పంపినట్లు ఆయుష్‌ కమిషనర్‌ రాములు తెలిపారు. వాళ్లు 500 మందికి ఇచ్చి వారి నుంచి పూర్తి స్థాయి పరిశీలన చేస్తున్నారని వెల్లడించారు. కాగా, ఈ మందు వినియోగం వల్ల ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? లేదా? అన్నది తేల్చాల్సిన అవసరం ఉందని సమావేశంలో చర్చించారు. 6–7 రోజుల్లో నివేదిక వస్తుందని, అప్పటి వరకు వేచి చూడాల్సిందేనని అధికారులు తెలిపారు.

 

 

You might also like

Leave A Reply

Your email address will not be published.