FbTelugu

ఇది కథ కాదు..

an-old-men-rial-story-in-amberpet

అది హైదరాబాద్‌ నగరంలోని అంబర్‌పేట. అర్ధరాత్రి ఒంటి గంట సమయం. ఆ రోడ్డుపై వచ్చే వాహనాలు వస్తున్నాయి. వెళ్లేవి వెళ్తున్నాయి. ట్రాఫిక్‌ తక్కువగానే ఉన్నా.. వాహనాలు వెళ్తూనే ఉన్నాయి. ఎవరి ప్రయాణాల్లో వారు బిజీగా ఉన్నారు. అదే సమయంలో నేను జూబ్లీహిల్స్‌లోని ఆఫీసు నుంచి దిల్‌సుఖ్‌నగర్‌లోని ఇంటికి వెళ్తున్నా.ఆ సమయంలో సన్నని చిరుజల్లులు. చినిగిన చొక్కా, మాసిన పంచెతో రోడ్డు పక్కన దుకాణం ముందు ఓ 70 ఏళ్ల వృద్దుడు. అతడి పక్కనే ఓ డొక్కు సైకిల్‌. దానికి వేలాడుతూ మూడు గుడ్డ సంచులు. ఎవరికోసమో ఎదురుచూపులు. ఈ సమయంలో సైకిల్‌తో పాటు అతడు అక్కడ ఎందుకున్నాడబ్బా అన్న అనుమానం వచ్చింది. కాసేపు అతడితో మాట్లాడాలనిపించింది. వెంటనే రోడ్డుపక్కన ఉన్న అతడి వద్దకు వెళ్లాను. అతడు ఆ సంచుల్లో ఆమ్లెట్లు, ఉడకబెట్టిన కోడిగుడ్లు, సమోసాలు పెట్టుకొని అమ్ముతున్నాడు. అదిచూసి నాకు ఆశ్చర్యమేసింది. ఈ సమయంలో ఇవి ఎవరు కొంటారు తాత అన్నాను. ఎవరో ఒకరు కొనకపోతారా బిడ్డా అన్నాడు. వారి కడుపు నింపితేనే.. నా కడుపు నిండుద్ది అన్నాడు నిర్వేదంగా. ఆ వయస్సులో ఏమిటీ కష్టాలు..? అతడి పరిస్థితి ఏంటి ? తెలుసుకోవాలన్న కుతూహలం నాలో మరింత పెరిగింది. కానీ, అతడు నాకు వివరాలు చెప్పేదానికంటే తన తినుబండారాలు ఎవరైనా కొంటారేమోనన్న ఆత్రుత ఎక్కువగా కనిపించింది. దానిని గమనించిన నేను ఆకలిగా లేకున్నా.. నేను వెంటనే రెండు ఆమ్లెట్లు, రెండు బాయిల్డ ఎగ్స్‌ కొన్నాను. అవి తినుకుంటూనే మాటల్లోకి దించా.. అర్ధరాత్రి ఇంత కష్టమెందుకు తాతా.. నీకు పిల్లలెవరూ లేరా అని అడిగా… అంతే, అతడిలో ఒక్కసారిగా ఏడుపు కట్టలు తెంచుకొంది. కళ్లెంట నీళ్లు జాలువారాయి. వర్షంతో తడిసిన తలలోంచి కారుతున్న నీటిలో ఆ కన్నీళ్లు కలిసిపోయాయి. అతడిని ఓదార్చడానికి నాకు చాలా సమయమే పట్టింది. ఆ తర్వాత అతడు తన కష్టాలను నాకు పూసగుచ్చినట్టు చెప్పాడు.

కొడకా, మాది ఆదిలాబాద్‌ జిల్లా. చేతికొచ్చిన ఒక్క కొడుకు తప్ప పెద్దగా ఆస్తిపాస్తులేమీ లేవు. ఊళ్లో పెద్దగా కూలి పనులేవీ దొరకుత లేవు. పట్నంలో పనులు దొరకుతయని నా కొడుకు, ముసిల్దానితో కలిసి ఇక్కడికి వచ్చినం. ఇక్కడ కూడా అనుకున్నంతగా ఏమీ లేదు. రామాంతపూర్‌లో రోడ్డు పక్కన పాత ఫ్లెక్సీలతో ఒక గుడిసెలాంటిది ఏసుకొని ఉంటున్నం. నా కొడుకు సోపతిగాళ్లు దుబాయి పోవాలనుకుంటున్నరని.. వాళ్లతో పాటు వెళ్తానని వెళ్లాడు. దానికోసం ఎక్కడెక్కదో తెలిసినోళ్ల దగ్గర అప్పుజేసి దుబాయికు పోయిండు. ఇదంతా జరిగి 15 ఏళ్లు అయితుండొచ్చు. అప్పుడు పోయిన కొడుకు మళ్లీ జాడలేడు. ఏడ ఉండో.. ఏమైండో తెల్వదు. ఆళ్ల సోపతుగాళ్లు మాత్రం జరమొచ్చి సచ్చిపోయిండని చెప్పిండ్లు. పదేళ్ల కిందట నా పెళ్లానికి పక్షవాతం వచ్చింది. మంచంనుంచి లేవలేదు. ఆమెకు ఎప్పుడూ మనిషి ఉండాల్సిందే. నాకూ వయసై పోయింది. పనిచేసే ఓపిక లేదు. పైగా ముసిల్దాన్ని వదిలి వెళ్లే పరిస్థితి లేదు. చేతిలో చిల్లిగవ్వ లేదు. తినడానికి ఏమీ లేక మూడు రోజుల పాటు నీళ్లు తాగి బతికినం.

బతకడానికి ఏదో చేయాలనిపించింది. కానీ, ముసిల్దాని పరిస్థితి ఏమిటా అని రెండు రోజులు ఆలోచించా.. రాత్రి ముసిల్ది పడుకున్నంక పనిచేసి డబ్బు సంపాదించాలనుకున్నా. అప్పుడు ఈ ఆలోచన వచ్చింది. పగలంతా ముసిల్దానితోనే ఉంటా. కొన్ని గుడ్లు తెచ్చి ఆమ్లెట్లు వేస్తా, కొన్నింటి ఉడకబెడతా, ఒక దుకాణపాయన కాడ అప్పుగా కొన్ని సమోసాలు తెస్తా. తెల్లవార్లూ జనాలు తిరుగుతూనే ఉంటారు కదా.. అందులో కొంతమంది కొన్నా చాలు అనుకున్నా. ఈ యాపారం మొదలు పెట్టిన బిడ్డా. మీలాంటి మనసున్న మారాజులు ఇవి కొంటే ఆ రోజుకు మా పొట్ట నిండుద్ది. లేకుంటే లేదు కొడకా అన్నాడు. మారాజుల దయ వల్ల ఇప్పుడు రోజుకు వంద రూపాయల దాకా సంపాయిత్తున్నా.. దాంతో మా తిండి, గుడ్డ, రోగాలకు మందులు ఎల్లదీస్తున్నాం. ఒక్కో రోజు ఒక్కటి కూడా అమ్ముడు పోదు. ఆ రోజు మాత్రం నాకు దండగే బిడ్డా. అంటూ కళ్లనీళ్లు తుడుచుకున్నాడు. అతడి కష్టాలు వింటుంటే నాకు తెలియకుండానే నా కళ్లల్లో కూడా నీళ్లు సుడులు తిరిగాయి. చివరగా అన్న అతడి మాటలు నాకు ఎంతో స్పూర్తినిచ్చాయి.

‘‘కూసోని తింటే కొండలైనా తరుగుతాయంటారు. కూసోని తినడానికి నా దగ్గర కొండలు (ఆస్తులు).. పనిచేయడానికి కండలూ లేవు. ఏదో ఇలా నాకు చేతనైన పని చేసుకుంటే ముసిల్దాన్ని చూసుకుంటూ బతుకీడుస్తున్నాం. ఎంత కష్టమొచ్చినా ఇలా బతుకుతానే తప్ప బిచ్చమెత్తుకునే స్థాయికి మాత్రం రాను’’ అని చెప్పాడు. ఈ మాటలు వింటుంటే అతడు ఒక పేదవాడిగా నాకు కనిపించలేదు. ఎంతో ఆత్మసై్థర్యం ఉన్న కోటీశ్వరుడిగా కనిపించాడు. హ్యాట్సాప్‌ తాత. మరో నాలుగు బాయిల్డ్‌ ఎగ్స్‌ కొని అక్కడి నుంచి ఇంటికి పయనమయ్యాను. అతని మాటలు వింటుంటే పనిచేయకుండా తల్లిదండ్రుల మీదే ఆధారపడుతున్న యువకులకు అతడో స్పూర్తి ప్రదాత అనిపించింది.

You might also like