టిఆర్ఎస్, బిజెపి పొత్తుకు షాకిచ్చిన ఓటర్లు

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ లో లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నిక బిజెపి లో చిచ్చు రేపిన విషయం తెలిసిందే. ఇవాల్టి కౌంటింగ్ లో ఈ డివిజన్ ఓటర్లు బిజెపి, టిఆర్ఎస్ పొత్తుకు చెక్ పెడుతూ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించారు.
దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మొన్న జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఈ డివిజన్ నుంచి ఆకుల రమేష్ రెడ్డి గెలుపొందిన తరువాత కరోనా పాజిటివ్ తో చనిపోయారు. ఆయన అకాల మరణంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించారు. ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ తరఫున ఎవరినీ పోటీలో పెట్టవద్దని బిజెపి నుంచి ప్రతినిధి బృందం ప్రగతి భవన్ వెళ్లింది. మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచందర్ రావు నేతృత్వంలో వెళ్లిన ప్రతినిధి బృందం మంత్రి కెటిఆర్ తో చర్చలు జరిపింది. కెటిఆర్ ఇచ్చిన హామీ ప్రకారం టిఆర్ఎస్ అభ్యర్థిని పోటీ పెట్టలేదు. ఇలా వెళ్లి కలవడంతో బిజెపిలో ముఖ్యనేతల మధ్య బేధాభిప్రాయాలు తలెత్తాయి.

తనకు తెలియకుండా బిజెపి నాయకులు ప్రగతి భవన్ పోవడం ఏంటంటూ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కార్యకర్తలు వీధుల్లో పోరాడుతుంటే ముఖ్య నేతలు ప్రగతి భవన్ కు ఎలా వెళ్తారంటూ సంజయ్ సీరియస్ గా పరిగణించారు. ఈ వ్యవహారంపై విచారించేందుకు ఒక కమిటీ వేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆదేశాల మేరకే మంత్రి కెటిఆర్ ను కలిశామని, ఇందులో తమ తప్పేమి లేదని మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు పార్టీ పెద్దలకు వివరణ ఇచ్చుకున్నట్లు సమాచారం. ఇవాళ జరిగిన కౌంటింగ్ లో బిజెపి, టిఆర్ఎస్ లోపాయకారి ఒప్పందానికి డివిజన్ ఓటర్లు చెక్ పెట్టారు. బిజెపి అభ్యర్థిని చిత్తు చిత్తుగా ఓడించారు. బిజెపి నుంచి మందుగుల అఖిల్ పవన్ గౌడ్, కాంగ్రెస్ నుంచి దర్పల్లి రాజశేఖర్ రెడ్డి నిల్చున్నారు. రాజశేఖర్ రెడ్డి గెలుపుతో గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ బలం మూడుకు చేరుకున్నది.

latest telugu newsTelugu breaking newstelugu news