స్వచ్ఛందంగా ‘కట్టు’దిట్టం !

కరోనా సెకండ్‌వేవ్‌ దూసుకుపోతోంది. మొదటి విడతను దాటుకుంటూ వెళుతోంది. ఎక్కడ చూసినా పాజిటివ్‌ కేసులో దర్శనమిస్తున్నాయి. కరోనా టెస్టింగ్‌ కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని రకాలుగా హెచ్చరించినా ప్రజల్లో మార్పు రావడం లేదు. కరోనాను నిర్లక్ష్యం చేయడమే కాకుండా కనీస నిబంధనలు పాటించడం లేదు. దీంతో కరోనా మరింత దూకుడును పెంచుతోంది. ఇప్పటికే మళ్లీ ఆసుపత్రుల్లో చికిత్స పొందే రోగుల సంఖ్య పెరుగుతోంది. రోజురోజుకూ ఆసుపత్రుల్లో రోగుల కిటకిటలు పెరుగుతున్నాయి. రోజువారిగా కరోనా కేసుల సంఖ్య పెరగడంలో ప్రధానంగా హైదరాబాద్‌ నగరంతో పాటు రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలు ముందు వరుసలో ఉన్నాయి. ఈ మూడు జిల్లాల్లోనే రోజుకు సుమారు వెయ్యిదాకా కేసులు నమోదవుతున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి.. ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు ఎక్కడా పొంతన లేకుండా పోయిందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో కేసుల వివరాలను వెల్లడించవద్దని ఆ జిల్లాల డీఎంహెచ్‌ఓలకు మౌఖిక ఆదేశాలు వచ్చినట్టు సమాచారం. అందుకే ఆ వివరాలు తెలిపేందుకు వైద్యశాఖాధికారులు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ పెట్టే పరిస్థితి లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు.

కానీ, నానాటికీ కరోనా కేసులు పెరుగుతుండడంతో కొన్ని ప్రాంతాల్లో ప్రజలే స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ విధించుకుంటున్నారు. రాష్ట్రంలోని నాలుగైదు జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో లాక్‌డౌన్‌ విధించుకుంటూ తీర్మానం చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇక, వ్యాపార వర్గాలు కూడా వ్యాపార సమయాన్ని తగ్గించుకుంటున్నాయి. హైదరాబాద్‌లోని బేగంబజార్‌కు చెందిన వ్యాపారులు సాయంత్రం ఐదు గంటలకే దుకాణాలన్నీ మూసివేయాలని నిర్ణయం తీసుకున్నాయి. కరోనా మొదట్లో కూడా ఈ వ్యాపార వర్గాలే ముందస్తుగా వ్యాపార సమయాన్ని తగ్గించుకున్నాయి. మళ్లీ అదే బాట పట్టాయి. ఇక, మరికొన్ని వ్యాపార సంఘాలు కూడా సాయంత్రం ఆరు గంటలకే దుకాణాలు మూసివేయాలని నిర్ణయించుకున్నాయి. ఇలా, ప్రభుత్వం నిర్ణయం కోసం ఆలోచించకుండా కొన్ని గ్రామాలు, వ్యాపార సంఘాలు లాక్‌డౌన్‌ విధించుకుంటున్నాయి. కరోనాపై ప్రజలతో పాటు ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరించకపోవడం వల్లే వైరస్‌ మరింతగా విజృంభిస్తోందని, దానిని నివారించేందుకు ప్రజలు స్వచ్ఛందగా ముందుకు రావడంతో పాటు కరోనా నిబంధనలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని.. ప్రభుత్వం కూడా నిబంధనలు పాటించని వారపై కఠిన చర్యలు తీసుకుంటేనే కరోనా నియంత్రణమని అందరూ కోరుతున్నారు. ఏదైమైనా ప్రజలు స్వచ్ఛందంగా ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకొంటేనే కరోనాను అంతం చేయగలం. ఆ దిశగా మనం పయనిస్తూ ఇతరులను కూడా చైతన్యం చేసి కరోనాకు చెక్‌ పెడదామా మరి.

Begum Bazar in Hyderabadlatest telugu newsTelugu breaking newstelugu news