అక్కడ కలివిడి.. ఇక్కడ విడివిడి!

పవర్‌స్టార్‌ పరిస్థితి ఏపీలో ఒకలా.. తెలంగాణలో మరోలా తయారైంది. వాస్తవానికి 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలు మిత్రపక్షంగా పోటీచేశాయి. ఈ ఎన్నికల్లో పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఈ పార్టీలకు మద్దతు ప్రకటించారు. అప్పుడు ఏపీలో తెలుగుదేశం, కేంద్రంలో బీజేపీ అధికారాన్ని హస్తగతం చేసుకున్నాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన టీడీపీ, బీజేపీలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఆ రెండు పార్టీలకూ దూరమయ్యారు.

ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో తన జనసేన పార్టీ నుంచి సొంతంగా పోటీచేశారు. ఈ ఎన్నికల్లో జనసేనకు ఒకే ఒక అసెంబ్లీ స్థానం దక్కింది. పవన్‌ కల్యాణ్‌ పోటీచేసిన రెండు స్థానాల్లోనూ ఓటమి పాలయ్యారు. అంతేకాదు ఆ రెండు నియోజకవర్గాల్లోనూ మూడోస్థానంలో నిలిచారు. ఆ తర్వాత పవన్‌ మళ్లీ బీజేపీ చెంతకు చేరారు. బీజేపీతో తమ మైత్రి కొనసాగుతోందని, భవిష్యత్‌లో జరగబోయే ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీతో కలిసే పోటీచేస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఏపీలో బీజేపీతో కలిసి అనేక ఆందోళనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలో బీజేపీ పోటీకి దిగింది. కానీ, బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేనాని పవన్‌ కల్యాణ్‌ కానీ, ఆ పార్టీ నాయకులు కానీ ఎవరూ బీజేపీకి మద్దతుగా ప్రచారం చేయలేదు. ఇప్పుడు హైదరాబాద్‌ నగర పాలక సంస్థకు ఎన్నికలు జరుగుతున్నాయి.

ఈ ఎన్నికల్లో అన్ని స్థానాలకూ పోటీ చేస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రకటించారు. ఎవరితోనూ పొత్తు లేదని, తాము ఒంటరిగా పోటీకి దిగుతున్నట్టు వెల్లడించారు. జనసేన కూడా తమ అభ్యర్థులను బరిలో నిలిపేందుకు సిద్ధమైంది. నేడో రేపో జాబితాను ప్రకటించే పనిలో ఉంది. అయితే, జనసేన బీజేపీతో పొత్తు విషయం గురించి ఆలోచిస్తున్నామని చెబుతోంది. కానీ, బీజేపీ మాత్రం ఇప్పటికే ఎవరితోనూ పొత్తులేదని ప్రకటించింది. దీంతో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉండకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగి పొత్తు కుదిరిస్తే తప్ప వీరు వేర్వేరుగా పోటీకి దిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ రెండు పార్టీల మధ్య పరిస్థితి ఏపీలో కలివిడి.. తెలంగాణలో విడివిడి అన్నట్టుగా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

latest telugu newsTelugu breaking newstelugu news