ఇలా అయితే. ఎన్నికలెందుకు ?

ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకునే దేశం. ఇక్కడ పాలకులను ప్రజలు ఎన్నుకుంటారు. ఆ పాలకులే ప్రజలను పరిపాలిస్తారు. ఇది మనం చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో చదువుకున్నది. పెద్దల ద్వారా తెలుసుకున్నది.. మహనీయుడు అంబేద్కర్‌ రాజ్యాంగంలో ఉన్నది. ఏమిటి.. ఈ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తున్నారు.. ఇవన్నీ మాకు తెలియవా.. చిన్న పిల్లలను అడిగినా చెబుతారు కదా అనుకుంటున్నారు కదా.. అవును అదే నేను చెప్పబోయేది కూడా. కానీ, మనందరం ఇప్పటి వరకు ఇదే నిజమని నమ్మాం.. ఇలాగే జరిగింది కూడా. కానీ, మనం ఇప్పటివరకు చూసిన ప్రజాస్వామ్యం.. చూసిన ప్రజాస్వామ్యం ఇప్పుడు తిరగబడింది. ప్రజలు ఎన్నుకున్న పాలకుల కంటే కేంద్రం నియమించిన లెఫ్టినెంట్‌ గవర్నర్‌కే అధికారాలుంటాయట.

మనం ఓట్లేసి గెలిపించిన పాలకులు ఆయన దగ్గర చేతులు కట్టుకొని కూర్చోవాల్సిందేనట. ఏమిటి నమ్మలేక పోతున్నారా.. ఇదంతా ట్రాష్‌ అనుకుంటున్నారా..? అయితే, మీరు దీనిగురించి తెలుసుకోవాల్సిందే. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఢిల్లీ కూడా ఒకటి. అన్ని రాష్ట్రాల్లాగే అక్కడ కూడా ప్రజలు ఓట్లు వేశారు. వారు వేసిన ఓట్లతో ప్రభుత్వం కూడా ఏర్పడింది. కానీ, అన్ని రాష్ట్రాలకు ఉన్నట్టు అక్కడి ప్రభుత్వానికి హక్కులు, బాధ్యతలు ఉండవని కేంద్రం చెబుతోంది. అది దేశానికి రాజధానిగా ఉంది కాబట్టి అక్కడ అన్ని అధికారాలు తాము నియమించిన లెఫ్టినెంట్‌ గవర్నర్‌కే ఉంటాయని, అక్కడ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన పాలకులకు ఎలాంటి హక్కులు ఉండవని తేల్చి చెప్పింది. అంతేకాదండోయ్‌ ఢిల్లీ ప్రభుత్వం అంటే గవర్నరే అని సాక్షాత్తూ కేంద్రం పార్లమెంట్‌లో బిల్లును పెట్టి ఆమోదించింది కూడా. దీని ప్రకారం ఇకపై ప్రజా ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆమోదించాల్సి ఉంటుంది. అన్ని నిర్ణయాలు, అన్ని ఫైళ్లూ ఆయన వద్దకు పోవాల్సిందే. కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనుమతి కావాలి.

ఇన్ని సంకెళ్లతో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ప్రజల కోసం ప్రత్యేకంగా చేయగలిగే అవకాశమేమీ ఉండదు. ప్రజాస్వామ్యం అన్న మాటకు బీజేపీ ఇలా విలువ లేకుండా చేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో బీజేపీని గెలిపిస్తే ఢిల్లీకి రాష్ట్ర ప్రతిపత్తి ఇస్తామని బీజేపీ గతంలో ఢిల్లీ ప్రజలకు వాగ్దానం చేసింది. అందుకు భిన్నంగా ఉన్న ఆ కాసిన్ని అధికారాలు కూడా లాక్కొని ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాని నామమాత్రం చేస్తుందన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఓట్లేసిన గెలిపించిన ప్రభుత్వాన్ని కాదని కేంద్రమే పెత్తనం చేయాలనుకుంటే ఢిల్లీలో ఎన్నికలు ఎందుకు.. అక్కడ ప్రజా ప్రభుత్వం ఎందుకు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో బీజేపీని ఓడించి ఆప్‌ పార్టీ గెలిచిందన్న అక్కసుతోనే బీజేపీ ఈ దారుణానికి పాల్పడిందని రాజకీయ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ఇలా ప్రజాస్వామ్య విలువలకే పాతర వేస్తోందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

latest telugu newsspecial story on electionsTelugu breaking newstelugu news