జగన్ పాలన బాగుండాలని ప్రార్థించా: రమణ దీక్షితులు

తిరుమల: ఏపీలో సిఎం జగన్ పాలన బాగుండాలని, ఆయన కుటుంబం సంతోషంగా ఉండాలని కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రార్థించినట్లు టిటిడి నూతన ప్రధాన అర్చకులు ఏవి.రమణ దీక్షితులు తెలిపారు.

ఆయనను పునర్ నియామకం చేస్తూ టిటిడి శుక్రవారం అర్థరాత్రి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసింది. తన పునర్నియామకంపై ఆలయ ప్రధాన అర్చకులు ఏవి.రమణదీక్షితులు మీడియా సమావేశం నిర్వహించారు. 2018లో చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్దంగా మిరాశీ అర్చకులను వయో పరిమితి పేరుతో రిటైర్మెంట్ చేసారన్నారు. సీఎం వైఎస్.జగన్ మళ్లీ స్వామి వారి సేవచేసుకునే మహత్భాగ్యాన్ని కల్పించారన్నారు. వంశపారంపర్యంగా వస్తున్న అర్చకుల హక్కులను గత టిడిపి ప్రభుత్వం రద్దు చెయ్యడంతో అర్చకులు చాలా నష్టపోయారన్నారు. వారి ఏలుబడిలో చాలా ఆలయాలు మూతపడ్డాయి., దేవతలకు ఆరాధన కరువైందన్నారు.
ధర్మాన్ని భగవంతుడు రక్షించినట్టుగా… అర్చకుల వంశపారంపర్యం హక్కులను సీఎం జగన్ పరిరక్షిస్తున్నారు. దేవాలయాలకు జగన్ పునర్ వైభవాన్ని కల్పిస్తారనే నమ్మకం కలిగింది. మాకోసం కృషి చేసిన టీటీడీ పాలకమండలి చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈఓ డా. కెఎస్.జవహర్ రెడ్డి, ఏవి ధర్మారెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిలకు దీక్షితులు పేరుపేరునా దన్యవాదాలు తెలిపారు.

అయితే ప్రస్తుతం ఉన్న ప్రధాన అర్చకుడి పరిస్థితి ఏంటని ప్రశ్నించగా, ఆయన ఏ పదవిలో ఉండాలో అధికారులు నిర్ణయిస్తారన్నారు. రాజు క్షేమంగా ఉండాలని బాలాజీని ప్రార్థించానని, రాజు ఎవరన్నది తనకు సంబంధం లేదన్నారు. పింక్ డైమండ్ పై కోర్టులో కేసు నడుస్తున్నదని, దాని పై స్పందించలేనని రమణ దీక్షితులు స్పష్టం చేశారు. అదే విధంగా దేవాలయాలు, గుడులను, బ్రాహ్మణ అర్చక కుటుంబాలను రాజకీయాలకు వాడుకోవడం దురదృష్టకరమని ఆయన ఆక్షేపించారు.

latest telugu newsnew chief priests of TTD are A. V. Ramana DixitNew Indian Express Tirumala Temple Chief Priests AV RamanaTelugu breaking newstelugu news