కమలంతో కలవరం !

నాగార్జునసాగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ప్రధానంగా ఇక్కడ టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్యే ఉంది. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తనయుడు నోముల భగత్‌కుమార్‌ టీఆర్‌ఎస్‌ తరఫున, కుందూరు జానారెడ్డి కాంగ్రెస్‌ తరఫున హోరాహోరీగా తలపడుతున్నారు. వీరికి బీజేపీ అభ్యర్థి కూడా గట్టి పోటీనే ఇస్తున్నారు. అయితే, టీఆర్‌ఎస్‌ బీసీ అభ్యర్థిని బరిలోకి దింపితే.. కాంగ్రెస్‌ రెడ్డి సామాజిక వర్గానికి సీటు ఇచ్చింది. ఈ రెండు పార్టీలకు భిన్నంగా బీజేపీ ఎస్టీ సామాజిక వర్గ అభ్యర్థికి టికెట్‌ ఇచ్చింది. ఈ నియోజకవర్గంలో ఎస్టీ సామాజికవర్గానికి చెందిన ఓట్లు 30వేలకు పైగానే ఉన్నాయి. దీంతో ఆ ఓట్లు ఎవరికి ఎక్కువ పోలవుతాయోనన్న కలవరం టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో మొదలైంది. ఇక్కడ ఎస్టీ సామాజిక వర్గం మొదటి నుంచి జానారెడ్డికి మద్దతుగా నిలిచింది. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల నర్సింహయ్యవైపు మళ్లినట్టు ఎన్నికల ఫలితాలను బట్టి అర్ధమవుతోంది. కానీ, ఈ సారి పరిస్థితి మరోలా ఉంది. ఇప్పుడు బీజేపీ నుంచి ఎస్టీ అభ్యర్థి రంగంలో ఉండడంతో వారి సామాజికవర్గానికి చెందిన ఓట్లు ఎవరికి పడతాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పటిలాగానే జానారెడ్డికి మద్దతు పలుకుతారా.. లేక గత అసెంబ్లీ ఎన్నికల్లో లాగా టీఆర్‌ఎస్‌ వెంట నడుస్తారా.. లేకుంటే తమ సామాజిక వర్గానికి చెందిన బీజేపీ అభ్యర్థికి జైకొడతారా అన్న కలవరం టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లో మొదలైంది. అందుకే వారి ఓట్లను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలన్నీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నేతలను, ప్రజాప్రతినిధులను రంగంలోకి దించాయి.

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఒకరు ఎస్టీ ఓటర్లతో ప్రమాణం కూడా చేయించుకుంటున్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై కాంగ్రెస్‌ నేతలు ఆందోళనకు దిగడంతో చివరకు ప్రమాణం చేయించిన ఆ ఎమ్మెల్యేపై కేసు కూడా నమోదైంది. మొత్తానికి నియోజకవర్గంలో ఎస్టీల ఓట్లు గణనీయంగా ఉండడంతో ఇక్కడ విజేతను నిర్ణయించే విషయంలో వారిదే నిర్ణయాత్మక శక్తిగా ఉంటుంది. మరి సాగర్‌లో ఎస్టీల ఓట్లు ఎటు మళ్లుతాయో.. బీజేపీ నుంచి ఎస్టీ అభ్యర్థి రంగంలోకి దిగడం వల్ల ఎవరికి లాభం కలుగుదుందో.. ఎవరికి నష్టం తెచ్చిపెడుతుందోనన్న చర్చ జోరుగా సాగుతోంది. మొత్తానికి వారి ఓట్లను సాధించేందుకు టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ అభ్యర్థులతో పాటు బీజేపీ కూడా శతవిధాలుగానే ప్రయత్నిస్తోంది. చివరకు విజయం వరిస్తుందో చూడాలి మరి.

latest telugu newsNagarjunasagar Assembly By-ElectionTelugu breaking newstelugu news