తానొకటి తలిస్తే..!

తానొకటి తలిస్తే దైవమొకటి తలంచిందన్నది సామెత. భక్తుడు ఓ కోరిక కోరుకుంటే దేవుడు మరో వరం ఇచ్చాడన్న అర్ధంలో ఈ సామెతను వాడతారు. ఇంతకీ ఈ సామెత గురించి ఇప్పుడు ఎందుకు చెబుతున్నారు అనేగా మీ డౌటనుమానం. ఇప్పుడు తెలంగాణలోని బీజేపీ పరిస్థితి ఈ సామెతకు సరిగ్గా సరిపోయింది. అదెలా అంటారా.. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక ఏప్రిల్‌లో జరగనుంది.

ఇటీవల కాలంలో దుబ్బాక అసెంబ్లీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయం తర్వాత బీజేపీ నాయకులు, కార్యకర్తలు మంచి జోరుమీదున్నారు. రాజకీయాల్లో తమ ఎత్తుగడలు బాగా పనిచేస్తున్నాయని, ఇలాంటి ఎత్తుగడలతోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చెపడతామని ధీమాతో కమలనాథులు ఉన్నారు. అయితే, వారి అంచనాలు, వ్యూహాలు, ఎత్తుగడలు ఇటీవల జరిగిన రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో బెడిసి కొట్టాయనుకోండి. కొత్త స్థానంలో గెలవడం అటుంచి ఉన్న స్థానాన్ని కూడా పోగొట్టుకుంది. ఈ విషయాలు కాసేప పక్కన పెడితే.. ఇలాంటి తరుణంలో నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ ఎన్నికల్లో గెలిచేంత శక్తి వాస్తవానికి బీజేపీకి లేదు. కానీ, ఇటీవల కాలంలో యువత అంతా తమ వెనుకే ఉందని, విజయం తథ్యమన్న ధీమాలో కమలనాథులు ఉన్నారు. కాకుంటే మంచి ఎత్తుగడ వేయాలని నిర్ణయించుకున్నారు. ఆ ఎత్తుగడను అభ్యర్థి నిర్ణయంలో తీసుకున్నారు. నామినేషన్ల చివరి తేదీ వరకు అభ్యర్థిని ప్రకటించవద్దని, టీఆర్‌ఎస్‌లో టికెట్‌ రాని వారిని తమ పార్టీలో చేర్చుకొని బీజేపీ టికెట్‌ ఇస్తే ఇక తమ విజయానికి తిరుగు ఉండదని భావించారు.

అదే వ్యూహాన్ని అనుసరించారు. కానీ, వారి ఎత్తుగడ ఫలించకపోగా అది వారికే దిమ్మతిరిగేలా చేసింది. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి తమ పార్టీలోకి ఎవరూ రాకపోగా బీజేపీకి చెందిన మంచి పట్టున్న కడారి అంజయ్య యాదవ్‌ కమలనాథులకు షాక్‌ ఇచ్చి టీఆర్‌ఎస్‌లో చేరాడు. మొదటి నుంచి టికెట్‌ వస్తుందని ఆశించిన ఆయనకు బదులుగా రవికుమార్‌ నాయక్‌కు బీజేపీ టికెట్‌ ఇవ్వడంతో కడారి అలిగి టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. అంతే కాదండోయ్‌.. బీజేపీకి ఇక్కడ మరో దిమ్మదిరిగే షాక్‌ తగిలింది. మొదటి నుంచి పార్టీకోసం పనిచేస్తున్న నివేదితారెడ్డి కూడా పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగారు. వాస్తవానికి ఈమె కూడా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ప్రచారం జరిగింది. కానీ, ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. మొత్తానికి ఇతర పార్టీల్లోని అసంతృప్తులను తమవైపునకు తిప్పుకుందామని కాచుకు కూర్చున్న బీజేపీ నేతలు తమ పార్టీలోని అసంతృప్తుల గురించి ఊహించలేక పోయారు. మొత్తానికి నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో బీజేపీ నేతలు ఒకటి తలిస్తే.. మరొకటి ఎదురైందని కమలనాథులు తలలు పట్టుకుంటున్నారు. అధికార టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు మాత్రం బోల్తా కొట్టిందిలే బుల్‌బుల్‌ పిట్టా అని పాడుకుంటున్నాయి.

bandi sanjaybjp anjaiah yadavdubbaka electionsGHMC electionsNagarjuna Sagarnalgonda bjp sreedharniveditha reddytelangana bjp