సీఎంను దూరం పెట్టింది అందుకేనా..?

ప్రధానమంత్రి ఏదైనా రాష్ట్ర పర్యటనకు వస్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్‌ స్వాగతం పలకడం సర్వసాధారణం. కానీ, ఈ సంప్రదాయానికి భిన్నంగా శనివారం హైదరాబాద్‌ పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్, గవర్నర్‌ తమిళిసైని దూరం పెట్టారు. బహుషా దేశంలో ఇలా జరగడం ఇదే తొలిసారేమో. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం హైదరాబాద్‌లో పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధి చేస్తున్న భారత్‌ బయోటెక్‌ సంస్థను ఆయన సందర్శించనున్నారు. అయితే ఈసారి ప్రధాని పర్యటన సందర్భంగా పీఎంవో నుంచి వచ్చిన ఆదేశాలు గతానికి భిన్నంగా ఉన్నాయి. హకీంపేట విమానాశ్రయానికి చేరుకునే ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు కేవలం ఐదుగురు అధికారులకు మాత్రమే అనుమతిస్తున్నట్టు పీఎంవో తెలిపింది.

ఈ మేరకు ప్రధాని వ్యక్తిగత సహాయకుడు వివేక్‌.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు ఫోన్‌ చేసి సమాచారం అందించారు. దీంతో సీఎస్‌ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, మేడ్చల్‌ కలెక్టర్‌ శ్వేతా మహంతి, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్, హకీంపేట ఎయిర్‌ ఆఫీస్‌ కమాండెంట్‌ మాత్రమే విమానశ్రయంలో మోదీకి స్వాగతం పలికేందుకు అనుమతి ఇచ్చినట్టు తెలంగాణ సీఎంవో వర్గాలు తెలిపాయి. సహజంగా ప్రధాన మంత్రి రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు విమానాశ్రయం వద్దే రాష్ట్ర ప్రజల తరఫున గవర్నర్, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు స్వాగతం పలుకుతారు. ఈ సారి కూడా అలాగే చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ రావు భావించారు. శనివారం మధ్యాహ్నం హకీంపేట విమానాశ్రయానికి చేరుకునే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వాగతం పలుకుతారని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రధాన మంత్రి కార్యాలయానికి సమాచారమిచ్చింది. దీనికి స్పందనగా ప్రధాన మంత్రి కార్యాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి శుక్రవారం సాయంత్రం ప్రత్యేక సమాచారం అందింది. ప్రధానమంత్రికి స్వాగతం పలకడానికి ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం లేదని ప్రధాన మంత్రి వ్యక్తిగత సహాయకుడు వివేక్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌కు ఫోన్‌ చేసి చెప్పారు. దీంతో తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం అవాక్కయ్యింది. గతంలో ఇలాంటి ఆదేశాలు చూడలేదని కూడా సీనియర్‌ అధికారులు వ్యాఖ్యానించినట్టుగా సీఎంవో వర్గాలు తెలిపాయి.

కారణం అదేనా..?

డిసెంబర్‌ ఒకటిన జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, బీజేపీలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. మేయర్‌ పీఠంపై కన్నేసిన బీజేపీ కేంద్రంలోని దాదాపు మంత్రులందరినీ రంగంమీదకు తీసుకువచ్చింది. ఒక దశలో ప్రధాని మోదీ కూడా ఎన్నికల ప్రచారానికి వస్తారని వార్తలు వెలువడ్డాయి. అయితే, ఎన్నికల ప్రచారానికి శనివారం చివరి తేదీ. ఇదే రోజు కేసీఆర్‌ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇదే తరుణంలో ప్రధాని కూడా హైదరాబాద్‌కు వస్తున్నారు. ప్రధాని శనివారం రోజే హైదరాబాద్‌కు రావడం వెనుక రాష్ట్ర బీజేపీ నేతల పాత్ర ఉందన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రచారానికి ప్రధాని స్థాయి వ్యక్తి రావడం బాగుండదని, కాబట్టి కరోనా వ్యాక్సిన్‌ పరిశీలన పేరుతో హైదరాబాద్‌కు వస్తే మీడియాతో పాటు రాష్ట్ర ప్రజల చూపంతా ఆయనపైనే ఉంటుందన్న భావనలో బీజేపీ నాయకత్వం ఈ ప్లాన్‌ అమలు చేస్తోందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు దేశమంతా కరోనా వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూస్తోంది. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్‌లో తయారయ్యే కరోనా వ్యాక్సిన్‌ పరిశీలనకు మోదీ వస్తున్నారు. ఒకవేళ కరోనా టీకా వేసే కార్యక్రమం హైదరాబాద్‌ నుంచే ప్రారంభిస్తామని మోదీ ప్రకటించినా.. దీనిపై ఆయన ఏది మాట్లాడినా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి లాభం జరుగుతుందని భావించే బీజేపీ నేతలు మోదీ పర్యటనకు తెరతీశారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే, మోదీ వెంట సీఎం కేసీఆర్‌ ఉంటే కరోనా టీకా ప్రకటనలో కేసీఆర్‌కు కూడా కలివస్తుందన్న అనుమానంతోనే మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్‌ను దూరం పెట్టారన్న వార్తలు కూడా గుప్పుమంటున్నాయి. అయితే, ఇందులో ఎంతవరకు నిజం ఉందో కమలనాథులకే తెలియాలి.

latest telugu newsTelugu breaking newstelugu news