ఐపీఎల్‌ ఆగేనా.. సాగేనా..?

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2021 సీజన్, 14వ ఎడిషన్‌.. క్రమంగా కళ తప్పుతున్నట్లు కనిపిస్తోంది. గత ఏడాది కరోనా ప్రభావంతో లాక్‌డౌన్‌ విధించడంతో క్రికెట్‌ ప్రియులు ఆందోళనలో పడ్డారు. తర్వాత పరిస్థితులు కొంత అనుకూలించడంతో ఇప్పుడిప్పుడే క్రీడలు ముమ్మరంగా సాగుతున్నాయి. అందులో భాగంగానే ఐపీఎల్‌ మ్యాచులు కూడా జోరుగా సాగుతున్నాయి. వివిధ జట్ల మధ్య పోటీ రసవత్తరంగా ఉంటోంది. ప్రస్తుతం కరోనా సెకండ్‌వేవ్‌ జోరందుకుంది. దీంతో చాలామంది ఉద్యోగులు, ప్రజలు ఇంటివద్ద నుంచే పనిచేస్తున్నారు. వారంతా ఇప్పుడు ఐపీఎల్‌ మ్యాచ్‌లు చూస్తూ ఇంటివద్దనే కాలం గడుపుతున్నారు. అయితే, ఇండియాలో కరోనా దూకుడును ప్రదర్శిస్తోంది. వారం రోజులుగా దేశంలో ప్రతిరోజూ 3లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. వేలమంది మరణిస్తున్నారు. కరోనా రోగులకు కనీసం ఆస్పత్రుల్లో బెడ్లు దొరకడం లేదు. ఆక్సిజన్‌ సరిపోక రోగుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఆక్సిజన్‌ కోసం ఆస్పత్రుల్లో రోగులు హాహాకారాలు పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్‌ పేరుతో భారీ ఎత్తున ఫ్రాంచైజర్లు, ప్రభుత్వాలు ఖర్చు చేయడం అవసరమా అన్న విమర్శలు తలెత్తుతున్నాయి. ఐపీఎల్‌కు పెట్టే ఖర్చే రోగుల కోసం పెడితే వారు బతుకుతారు కదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ విమర్శలు వస్తోంది జనం నుంచి కాదు సుమండి.. ఐపీఎల్‌ ఆడుతున్న క్రీడాకారుల నుంచే. అందుకే ఈ పోటీలనుంచి తప్పుకోవాలని అనేకమంది క్రీడాకారులు నిర్ణయించుకున్నారు. దేశంలో నెలకొన్న కరోనా వైరస్‌ పరిస్థితులు పలువురు క్రికెటర్లను భయాందోళనలకు గురి చేస్తున్నాయి.

ప్రత్యేకించి విదేశీ ఆటగాళ్లు. కరోనా వైరస్‌ పంజా విసురుతున్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఒక్కరొక్కరుగా జట్లను వీడుతున్నారు. స్వదేశానికి తిరుగుముఖం పట్టారు. ఇదివరకు ఆండ్రూ టై, ఆ తరువాత స్టార్‌ స్పిన్‌ బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌.. అర్ధంతరంగా ఈ మెగా క్రికెట్‌ టోర్నమెంట్‌ నుంచి తప్పుకొన్నారు. ఆడమ్‌ జంపా, కేన్‌ రిచర్డ్‌సన్‌దీ అదే పరిస్థితి.తాజాగా ఆస్ట్రేలియాకే చెందిన డేవిడ్‌ వార్నర్, స్టీవ్‌ స్మిత్, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ కూడా స్వదేశానికి తిరుగుముఖం పట్టే అవకాశాలున్నాయన్న ప్రచారం సాగుతోంది. డేవిడ్‌ వార్నర్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కేప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. స్టీవ్‌ స్మిత్‌ ఢిల్లీ కేపిటల్స్‌ తరఫున ఆడుతున్నాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరులో గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ కీలక బ్యాట్స్‌మెన్‌గా ఉంటున్నాడు. ఈ ముగ్గురు కూడా ఐపీఎల్‌ 2021 సీజన్‌ నుంచి తప్పుకోనే అవకాశాలు ఉన్నాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రోజూ లక్షల సంఖ్యలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్ట్రేలియా ప్రభుత్వం.. భారత్‌ నుంచి వచ్చే వారిపై నిషేధిం విధించే అవకాశాలు ఉన్నాయి. ఒక్కొక్కరుగా ఐపీఎల్‌ను వీడుతున్న సమయంలో ఐపీఎల్‌ ముందుకు సాగుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌గంగూలీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఐపీఎల్‌ కొనసాగుతుందని ఘంటాపథంగా చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని, అసలు అక్కడ ఏం జరుగుతుందోనని క్రికెట్‌ అభిమానులు టెన్షన్‌గా ఎదురుచూస్తున్నారు.

Indian Premier Leaguelatest telugu newsTelugu breaking newstelugu news